
భారత్ పై అంతర్జాతీయ ఇంధన దిగ్గజాల కన్ను
నియంత్రణ తొలగింపుతో లాభసాటిగా ఇంధన రిటైల్ వ్యాపారం...
♦ ఏటీఎఫ్ విక్రయానికి బీపీకి లెసైన్స్
♦ చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ముంబై: భారత రిటైల్ ఇంధన మార్కెట్‌పై అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కన్నేశాయి. చమురు వినియోగిస్తోన్న అతి పెద్ద నాలుగో దేశంగా ఉన్న భారత్‌లో పాగా వేయాలని ఈ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణను కేంద్రం తొలగించడంతో భారత్‌లో ఇంధన మార్కెటింగ్ వ్యాపారం లాభసాటిగా మారిన నేపథ్యంలో భారత రిటైల్ ఇంధన మార్కెట్ అంతర్జాతీయ చమురు కంపెనీలను ఆకర్షిస్తోంది.
ఆ కంపెనీల ప్రవేశానికి వీలు కల్పిస్తాం...
అంతర్జాతీయ ఆయిల్ దిగ్గజ కంపెనీలు సౌదీ ఆరామ్‌కో, టోటల్, రాయల్ డచ్ షెల్, బీపీ, రాస్‌నెఫ్ట్ తదితర కంపెనీలు భారత రిటైల్ ఇంధన మార్కెట్లోకి రావాలని చూస్తున్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతను... ఈ విషయం(భారత రిటైల్ మార్కెట్లో అంతర్జాతీయ కంపెనీల రంగప్రవేశం) ప్రతిబింబిస్తోందని ఆయన వివరించారు. ప్రైవేట్ రంగంలోని చమురు శుద్ధి కంపెనీలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్ ఆయిల్ కంపెనీలు మూసేసిన తమ పెట్రోల్ బంక్‌లను తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని, వ్యాపార విస్తరణ కోసం కొత్త రిటైల్ అవుట్‌లెట్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు.
మరిన్ని ప్రైవేట్ బంక్‌లు
ఫ్రాన్స్ కంపెనీ టోటల్, యూరోప్ దిగ్గజం రాయల్ డచ్ షెల్ కంపెనీలు భారత ఇంధన మార్కెటింగ్ రంగంలో ప్రస్తుతం నామమాత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇప్పుడు ఈ సంస్థలు కూడా ఈ రంగంలో మరింతగా విస్తరించాలనుకుంటున్నాయని వివరించారు. ఇటీవలనే షెల్ కంపెనీ అధికారులు తనను కలిశారని, దక్షిణ భారత దేశంలో వారి రిటైల్ నెట్‌వర్క్ విస్తరణ గురించి చర్చించారని పేర్కొన్నారు. విమానయాన ఇంధనం విక్రయించడానికి బ్రిటిష్ పెట్రోలియమ్(బీపీ) కంపెనీకి లెసైన్స్ ఇచ్చేందుకు చమురు మంత్రిత్వ శాఖ అంగీకరించిందని తెలిపారు.
బీపీ కంపెనీ భారత రిటైల్ రంగంలో కూడా విస్తరించే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. రిఫైనరీలు, పెట్రోకెమికల్ ప్రాజెక్ట్స్‌లో వాటా తీసుకోవాలని భారత్ ఇటీవలనే సౌదీ ఆరామ్‌కో కంపెనీని కోరింది. అంతర్జాతీయంగా విస్తరించాలని యోచిస్తున్నామని సౌదీ అరామ్‌కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమిన్ నాసర్ గత నెలలో పేర్కొన్నారు. భారత్, అమెరికా, ఇండనేషియా, వియత్నామ్, చైనాల్లో జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.