ఎస్‌బీఐ లాభం డబుల్‌ | SBI profit double | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ లాభం డబుల్‌

Published Sat, May 20 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

ఎస్‌బీఐ లాభం డబుల్‌

ఎస్‌బీఐ లాభం డబుల్‌

క్యూ4లో రూ.2,815 కోట్లు...
నికర వడ్డీ ఆదాయం వృద్ధిలో జోరు
తగ్గుముఖం పట్టిన మొండిబకాయిలు....
స్థూల ఎన్‌పీఏలు 6.4%; నికర ఎన్‌పీఏలు 3.73%


న్యూఢిల్లీ: వరుసగా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు వెల్లడిస్తున్న నిరుత్సాహఫలితాలు చూసి బెంబేలెత్తిన ఇన్వెస్టర్లకు శుక్రవారం ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఊరటనిచ్చింది. ఎన్‌పీఏలు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం జోరుగా పెరగడంతో ఎస్‌బీఐ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రెట్టింపై రూ. 2,815 కోట్లకు చేరింది.

గతేడాది ఇదేకాలంలో బ్యాంకు స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ. 1,264 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు స్టాండెలోన్‌ నికరలాభం 5.36 శాతం వృద్ధిచెంది రూ. 9,951 కోట్ల నుంచి రూ. 10,484 కోట్లకు చేరింది. అయితే పూర్తి సంవత్సరానికి కన్సాలిడేటెడ్‌ నికరలాభం మాత్రం 98 శాతం క్షీణించి రూ. 12,225 కోట్ల నుంచి రూ. 241 కోట్లకు పడిపోయింది. పూర్తి సంవత్సరంలో కేటాయింపులు గణనీయంగా పెరిగిన కారణంగా కన్సాలిడేటెడ్‌ నికరలాభం బాగా తగ్గింది.

మొండి బకాయిలు తగ్గాయ్‌..
ఈ ఏడాది మార్చి చివరినాటికి ఎస్‌బీఐ గ్రూప్‌ స్థూల నిరర్థక ఆస్తులు 9.04 శాతం నుంచి 6.4 శాతానికి, నికర నిరర్ధక ఆస్తులు 5.15 శాతం నుంచి 3.73 శాతానికి తగ్గాయి. స్టాండెలోన్‌ ప్రాతిపదికన మాత్రం స్థూల ఎన్‌పీఏలు 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెరగ్గా, నికర ఎన్‌పీఏలు 3.81 శాతం నుంచి 3.71 శాతానికి తగ్గాయి. నాల్గవ త్రైమాసికంలో మొండి బకాయిల కేటాయింపులు గతేడాది ఇదేకాలంతో పోలిస్తే రూ. 12,139 కోట్ల నుంచి రూ. 10,993 కోట్లకు క్షీణించాయి. నాల్గవ త్రైమాసికంలో బ్యాంకు ఆపరేటింగ్‌ లాభం 12.93 శాతం మెరుగుపడి రూ. 14,192 కోట్ల నుంచి రూ. 16,026 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 17.33 శాతం వృద్ధితో రూ. 15,401 కోట్ల నుంచి రూ. 18,071 కోట్లకు చేరింది. అయితే నికర వడ్డీ మార్జిన్లు 0.16 శాతం తగ్గుదలతో 3.27 శాతం నుంచి రూ. 3.11 శాతానికి దిగాయి.

విలీన బ్యాంకుల ఖాతాల్ని కలపలేదు...
మార్చితో ముగిసిన త్రైమాíసికపు ఫలితాల్లో ఇటీవల ఎస్‌బీఐలో విలీనమైన అనుబంధ బ్యాంకుల ఖాతాల లెక్కలు కలవలేదు. ఐదు అనుబంధ బ్యాంకులైన స్టేట్‌ బ్యాంక్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెంకోర్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లతో పాటు భారతీయ మహిళా బ్యాంక్‌లు ఎస్‌బీఐలో విలీనం ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చినందున, ఈ మెగాబ్యాంకు జూన్‌లో వెల్లడించే ఫలితాల్లో విలీన బ్యాంకుల ఖాతాలూ కలుస్తాయి. మార్కెట్‌లో ట్రేడింగ్‌ జరుగుతుండగానే ఎస్‌బీఐ ఫలితాలు వెల్లడికాగా, ఫలితాలకు స్పందనగా రూ. 302–315 కనిష్ట, గరిష్టస్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎస్‌బీఐ షేరు చివరకు 1.72% పెరుగుదలతో రూ.308.15 వద్ద ముగిసింది.  

భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలిస్తాం
తాజాగా ముగిసిన త్రైమాసికం క్లిష్టమైనదే..కానీ సంతృప్తినిచ్చింది. మా అనుబంధ బ్యాంకులకు సంబంధించి విలీన ఖర్చులేవీ ఇక వుండబోవు. అందుకు సంబంధించిన కష్టనష్టాల్ని ఇప్పటికే భరించాం. భవిష్యత్తులో మరింత మెరుగైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడిస్తాం. ప్రస్తుత క్వార్టర్లో అవసరమైన వీఆర్‌ఎస్‌ వ్యయాల్లో 75 శాతం 2016–17 ఖాతాల్లోనే కేటాయించేశాం.  
– అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ  చైర్‌పర్సన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement