
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వెల్లడైన రూ.11,000 కోట్ల కుంభకోణం దరిమిలా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు ఇటీవల భారీ పతనాన్ని చవిచూసాయి. ఈ రంగంపై ఏర్పడిన నెగిటివ్ సెంటిమెంట్ కారణంగా ప్రముఖ బ్యాంకింగ్ షేర్లయిన ఎస్‌బీఐ, బీఓబీలు కూడా క్షీణతను చవిచూసాయి. దాంతో సహజంగానే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలయ్యింది. కానీ కొన్ని స్కీముల్లో మాత్రమే ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులు ఎక్కువ వున్నాయి. అన్నింటికంటే అధికంగా జనవరి నెలాఖరునాటికి హెచ్‌డీఎఫ్‌సీ ఇన్‌ఫ్రా ఫండ్ మొత్తం పెట్టుబడుల్లో 18.40 శాతం పెట్టుబడి ఈ షేర్లలో వుంది.
రిలయన్స్ విజన్ ఫండ్‌కు 17.55 శాతం, ఎల్‌ఐసీ ఎంఎఫ్ ఈక్విటీ ఫండ్‌కు 17.14 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌కు 15.01 శాతం రిలయన్స్ ట్యాక్స్ సేవర్ (ఈఎల్‌ఎస్‌ఎస్) ఫండ్‌కు 14.82 శాతం చొప్పున పెట్టుబడులు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో వున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ ప్రీమియర్ మల్టీక్యాప్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ టాప్–200 ఫండ్, ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా హైగ్రోత్ కంపెనీస్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ ట్యాక్స్ సేవర్‌లు 10–12 శాతం మధ్య పెట్టుబడుల్ని ఈ షేర్లలో కలిగివున్నాయి.