![కమోడిటీల్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కి సెబీ ఆమోదం](/styles/webp/s3/article_images/2017/09/5/51497387305_625x300.jpg.webp?itok=VxIxCpKa)
కమోడిటీల్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కి సెబీ ఆమోదం
సెటిల్‌మెంట్, ట్రేడింగ్ వేళలపై మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కమోడిటీ ఫ్యూచర్స్‌లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతించే ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం ఆమోదముద్ర వేసింది. అయితే, ప్రాథమికంగా ఒకే ఒక్క కమోడిటీ ఫ్యూచర్స్‌లో ఆప్షన్ ట్రేడింగ్ ప్రవేశపెట్టాలని, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేలా పటిష్టమైన రిస్కు మేనేజ్‌మెంట్ చర్యలు పాటించాలని కమోడిటీ ట్రేడింగ్ ఎక్సే్ఛంజీలకు సూచించింది. ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతించబోయే కమోడిటీలకు సంబంధించి కఠినతరమైన నిబంధనలు విధించింది. వీటి ప్రకారం ఆప్షన్స్ ట్రేడింగ్‌కు ఎంపిక చేసే కమోడిటీ... గడిచిన 12 నెలల్లో మొత్తం ట్రేడింగ్ టర్నోవరు విలువలో పరిమాణంపరంగా టాప్ 5 కమోడిటీల్లో ఒకటై ఉండాలి.
అంతేగాకుండా వ్యవసాయోత్పత్తులు, అగ్రి–ప్రాసెస్డ్ కమోడిటీలకు సంబంధించి గడిచిన ఏడాది వ్యవధిలో ఫ్యూచర్స్ కాంట్రాక్టుల సగటు రోజువారీ టర్నోవరు కనీసం రూ. 200 కోట్లుగా ఉండాలి. ఇతర కమోడిటీలైతే ఈ విలువ రూ. 1,000 కోట్లుగా ఉంటుంది. ఆప్షన్స్ కాంట్రాక్టులు ప్రారంభించదల్చుకునే కమోడిటీ డెరివేటివ్స్ ఎక్సే్ఛంజీలు.. ముందస్తుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సెబీ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. పొజిషన్ పరిమితులు, సెటిల్‌మెంట్ విధానం, ట్రేడింగ్ వేళలకు సంబంధించి కూడా సెబీ మార్గదర్శకాలు జారీ చేసింది. కమోడిటీల్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతించాలంటూ ఎక్సే్ఛంజీలు చాన్నాళ్లుగా కోరుతున్న నేపథ్యంలో సెబీ ఆమోదముద్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
స్వాగతించిన ఎక్సే్ఛంజీలు..
సెబీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఎంసీఎక్స్ ఎండీ మృగాంక్ పరాంజపే తెలిపారు. దేశీ కమోడిటీ మార్కెట్‌ను మరింత పటిష్టపర్చేందుకు ఇది దోహదపడగలదన్నారు. ఫ్యూచర్స్‌ను వినియోగించుకోవడం మొదలుపెట్టిన అనేక మంది రైతులతో పాటు భారీ స్థాయిలో ట్రేడింగ్ వర్గాలకు కూడా రిస్కు మేనేజ్‌మెంట్‌పరంగా ఆప్షన్స్ మెరుగైన సాధనంగా ఎన్‌సీడీఈఎక్స్ వర్గాలు పేర్కొన్నాయి.
కమోడిటీ ఎక్సే్ఛంజీల్లో ఇన్వెస్టర్ సర్వీస్ ఫండ్ ..
ఇన్వెస్టర్లకు మెరుగైన సేవలు అందించేందుకు, వారి ప్రయోజనాలు పరిరక్షించేందుకు కమోడిటీ ఎక్సే్ఛంజీలు తప్పనిసరిగా ఇన్వెస్టర్ సర్వీస్ ఫండ్ (ఐఎస్‌ఎఫ్), ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐపీఎఫ్) ఏర్పాటు చేయాలని సెబీ ఆదేశించింది.
మరిన్ని విశేషాలు..
⇔ సెబీ మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక దశలో ఫండ్‌కి ఎక్సే్ఛంజీలు రూ. 10 లక్షలు సమకూర్చాలి. అటుపైన సభ్యుల నుంచి వసూలు చేసే టర్నోవర్ ఫీజులో ఒక శాతాన్ని నెలవారీ ప్రాతిపదికన ఐఎస్‌ఎఫ్‌కు బదలాయించాలి. సర్వీస్ సెంటర్లలో డమ్మీ టెర్మినల్స్ కూడా ఉండాలి. ఇన్వెస్టర్ల ఫిర్యాదులను స్వీకరించేందుకు, కౌన్సెలింగ్ సర్వీసులు అందించేందుకు సదుపాయాలు ఉండాలి.
⇔ ఇన్వెస్టర్ల రక్షణ నిధికి గరిష్టంగా అయిదుగురు ట్రస్టీలు ఉండొచ్చు. సెబీ గుర్తింపు పొందిన ఇ న్వెస్టర్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు, ఎక్స్ఛేం జీకి చెందిన ఒక అధికారి ఇందులో ఉండాలి.
⇔ సెటిల్‌మెంట్ సంబంధ పెనాల్టీలు తప్ప ఎక్సే్ఛంజీకి జరిమానాల రూపంలో వచ్చే నిధులన్నీ కూడా ఐపీఎఫ్ ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది. ఎక్సే్ఛంజీ మెంబర్/బ్రోకింగ్ సంస్థ గానీ డిఫాల్ట్ అయితే ఇన్వెస్టర్.. ఐపీఎఫ్ నుంచి పరిహారం పొందవచ్చు. కమోడిటీ ఎక్సే్ఛంజీలు తమ తమ ఐపీఎఫ్ ట్రస్ట్‌తో సంప్రదించి తగు నష్ట పరిహార పరిమితులను నిర్ణయించాల్సి ఉంటుంది. ఐపీఎఫ్ కార్పస్ నిధిపై వచ్చే ఆదాయాన్ని ఎక్సే్ఛంజీలు ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. ఐపీఎఫ్, ఐఎస్‌ఎఫ్‌కి ఎక్సే్ఛంజీలు వేర్వేరు బ్యాంకు ఖాతాలు నిర్వహించాల్సి ఉంటుందని సెబీ నిర్దేశించింది.