న్యూఢిల్లీ: ప్యారడైజ్ పేపర్ల లీకేజీ నేపథ్యంలో కార్పొరేట్ పరిపాలనా వైఫల్యంతో పాటు, నిధులు మళ్లించిన సంస్థలపై సెబీ దృష్టి సారించింది. విజయ్ మాల్యాతో సంబంధం ఉన్న కొన్ని కంపెనీలపై సెబీ లోగడే దర్యాప్తు చేయగా, అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల కూటమి (ఐసీఐజే) విడుదల చేసిన ‘ప్యారడైజ్ పేపర్ల’లో ఏవైనా అదనపు వివరాలున్నాయా అన్నదాన్ని సెబీ పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఏదైనా భారతీయ కంపెనీ పన్నుల పరంగా స్నేహపూర్వక చట్టాలున్న దేశం నుంచి పనిచేస్తుండడం నిబంధనల ఉల్లంఘన కిందకు రాకపోవచ్చని, అయితే ఆయా సంస్థల గురించి తెలియజేయకపోవడం, వాటికి నిధులు మళ్లింపు జరిగిందా అన్నది విచారణ తర్వాతే తేలుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో విదేశీ విభాగాల గురించి సంబంధిత కంపెనీలు వివరాలు తెలియజేయాలని సెబీ కోరనుందని, అవి ఇచ్చే వివరాలతో వార్షిక నివేదికలు సహా ఇతర సమాచారంతో సరిపోల్చి చూడడం జరుగుతుందని వివరించారు.
ఇతర దర్యాప్తు ఏజెన్సీలతోనూ సెబీ సమాచారం ఇచ్చిపుచ్చుకుంటుందని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు, వ్యక్తులు నిర్వహించిన విదేశీ కార్యకలాపాలను ప్యారడైజ్ పేపర్లు బయట పెట్టిన విషయం తెలిసిందే. ప్యారడైజ్ పేపర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జీఎంఆర్ ఇన్‌ఫ్రాతో పాటు జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఎస్సార్ షిప్పింగ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, సన్ టీవీ నెట్‌వర్క్, అపోలో టైర్స్, యునైటెడ్ స్పిరిట్స్ తదితర కంపెనీల పేర్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment