
సహారా ఆస్తులు అమ్మండి..
సెబీకి సుప్రీం ఆదేశం
ఇందుకు ఒక యంత్రాంగాన్ని
ఏర్పాటు చేయాలని సూచన
న్యూఢిల్లీ: చిన్న మదుపుదారులకు సహారా గ్రూప్ సంస్థలు చెల్లించాల్సిన రూ.30,000 కోట్లకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. డబ్బు చెల్లింపులకు గాను ఆ సంస్థ ఆస్తులను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విక్రయించడానికి వీలు కల్పించింది. ఇందుకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. తాను ఆస్తులను విక్రయించలేకపోతున్నట్లు సహారా ఇచ్చిన వివరణతో అసంతృప్తి వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తాజా ఆదేశాలు ఇచ్చింది.
దాదాపు రెండేళ్ల నుంచీ సహారా గ్రూప్ చీఫ్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జైలులో ఆయనకు ఎటువంటి అదనపు సదుపాయాలూ కల్పించరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తనఖాలోలేని దాదాపు 89 ఆస్తులను అమ్మడానికి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. విక్రయించేందుకు గుర్తించిన ఆస్తుల్లో ఆంబే వ్యాలీ, విదేశాల్లోని సహారా ఆస్తులు లేవు. వచ్చే వారంలోగా ఆస్తుల అమ్మకపు ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది. ఈ కేసులో సహారా చీఫ్‌ను ఎలా జైలుకు పంపుతారని ప్రశ్నించిన సంస్థ న్యాయవాది కపిల్ సిబల్‌పై బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు అంశాలపై వాదించాలితప్ప, అనవసర అంశాలపై వద్దని స్పష్టంచేసింది.