ఇన్ఫోసిస్ డాలర్ ఆదాయ అంచనాలను తగ్గించడం సోమవారం స్టాక్ మార్కెట్‌ను పడగొట్టింది.
ఐటీ షేర్లు డీలా...
* తగ్గని లోహ షేర్ల జోరు
ఇన్ఫోసిస్ డాలర్ ఆదాయ అంచనాలను తగ్గించడం సోమవారం స్టాక్ మార్కెట్‌ను పడగొట్టింది. ఇన్ఫోసిస్ ఫలితాలతో ఐటీ షేర్లు నష్టపోయాయి. గత వారం భారీ లాభాల నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 175 పాయింట్లు నష్టపోయి 26,904 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 8,144 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇన్ఫోసిస్ ఫలితాలతో ఐటీ షేర్లు డీలా పడ్డాయి.
ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పతనం కాగా, లోహ, ఆయిల్ స్టాక్స్ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కమోడిటీల ధరలు పెరుతుండటంతో లోహ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది.
ఇన్ఫీ... కొత్త గరిష్ట స్థాయిని తాకి...
సెప్టెంబర్ క్వార్టర్లో నికర లాభం పెరగడంతో ఇన్ఫోసిస్ కొత్త ఏడాది గరిష్ట స్థాయి(రూ.1,220)ని తాకింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో డాలర్లలో ఆదాయ ఆర్జన అంచనాలు తక్కువగా ఉండటంతో చివరకు 3.8 శాతం నష్టంతో రూ.1,122 వద్ద ముగిసింది. సెప్టెంబర్ వినియోగదారుల ద్రవ్యోల్బణ, ఆగస్టు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో (మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి) ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు.
డాలర్‌తో రూపాయి మారకం బలహీనంగా ఉండడం, సోమవారం ప్రారంభమైన బీహార్ ఎన్నికలు, బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హాంగ్‌కాంగ్‌కు తరలిన నల్లధనం... ఈ అంశాలన్నీ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రారంభంలో 225 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇన్ఫోసిస్ ఫలితాలతో నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 175 పాయింట్ల నష్టంతో 26,904 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం 11 శాతం లాభపడిన వేదాంత షేర్ జోరు సోమవారం కూడా కొనసాగింది.
రేపు కాఫీ డే ఐపీఓ
బెంగళూరు: కాఫీ డే రూ.1,500 కోట్ల ఐపీఓ బుధవారం ప్రారం భం కానున్నది. ఈ ఐపీఓ నిధులతో రుణ భారం తగ్గించుకుంటామని, మరిన్ని ఆవుట్‌లెట్లను ప్రారంభిస్తామని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ వి. జి. సిద్ధార్థ చెప్పారు. ప్రస్తుతం 219 నగరాల్లో 1,538 కాఫీ అవుట్‌లెట్‌లు ఉన్నాయని వివరించారు. ఒక్కో కాఫీ డే అవుట్‌లెట్ సగటు రోజువారీ ఆదాయం రూ.13,700 అని కేఫ్ కాఫీ డే సీఈఓ ఏ. వేణు మాధవ్ చెప్పారు.
స్టార్టప్‌ల నిబంధనల్లో మార్పులు తెస్తాం: సెబీ చైర్మన్ వెల్లడి
న్యూఢిల్లీ: స్టార్టప్‌ల నిధుల సమీకరణ మరింత సులభమయ్యేలా నిబంధనల్లో మార్పులు తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని సెబీ భరోసానిచ్చింది. నిధుల సమీకరణ కష్టసాధ్యంగా కాకుండా ఉండేలా మార్గాలను చూస్తున్నామని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సెబీ చైర్మన్ యు.కె. సిన్హా చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో సరళీకరించిన స్టార్టప్‌ల లిస్టింగ్ నిబంధనలను సెబీ నోటిఫై చేసింది. స్టార్టప్‌లు... ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ కంపెనీలని సిన్హా పేర్కొన్నారు. మంచి ఆదాయం రావడానికి ఎంత అవకాశముందో, నష్టాలు రావడానికి కూడా అంతే అవకాశాలున్నాయన్నారు.