రాకెట్ స్పీడులా దూసుకుపోయిన స్టాక్ మార్కెట్స్
వాయువేగంతో దూసుకుపోయిన దేశీయస్టాక్‌మార్కెట్లు శుక్రవారం చారిత్రాత్మక స్థాయిలను నమోదుచేశాయి.
31వేలకు పైన సెన్సెక్స్
తొలిసారి 9600 మార్కును తాకిన నిఫ్టీ
ముంబై: వాయువేగంతో దూసుకుపోయిన దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం చారిత్రాత్మక స్థాయిలను నమోదుచేశాయి. ముఖ్యంగా బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 31వేల స్థాయిని అధిగమించి మెరుపులు మెరిపించింది. ఇదే బాటలో పయనించిన నిఫ్టీ కూడా తొలిసారి ఆల్ టైం హై 9600 మార్కును తాకి, చివరికి 85.35 పాయింట్ల లాభంలో 9,595 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో 324 పాయింట్ల ర్యాలీ కొనసాగించిన సెన్సెక్స్ 31,074 వద్ద, 95 పాయింట్ల ర్యాలీ సాగించిన నిఫ్టీ 9,605 వద్ద రికార్డ్ స్థాయిలను తాకాయి. మెటల్ రంగం 3.7 శాతం దూసుకెళ్లగా.. ఆటో 1.6 శాతం ఎగిసింది. బ్యాంక్ నిఫ్టీ 0.6 శాతం లాభపడి మార్కెట్లకు జోష్‌నిచ్చింది. అయితే, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ లో అమ్మకాలు కొనసాగగా, ఫార్మా మాత్రం వెనకడుగు వేసింది.
జూన్ ఎఫ్ అండ్ ఓ సిరీస్ ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు వెంటనే లాభాల్లోకి రాకెట్ లా దూసుకుపోయాయి. టాటా స్టీల్ హిందాల్కో, వేదాంతా, అదానీ పోర్ట్స్, రిలయన్స్(ఆర్‌ఐఎల్), ఐబీ హౌసింగ్, యస్‌బ్యాంక్, టాటామోటార్స్ డీవీఆర్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ , ఐటీసీ, ఐషర్ మోటార్స్ భారీ లాభాల్లో కొనసాగాయి. నిన్నటి ర్యాలీకి కొనసాగింపుగా నేటి మార్కెట్లు దూసుకుపోయినట్టు ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ తెలిపారు.