ముంబై : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన అనూహ్య ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్‌బీఐ ప్రకటన చేసిన అనంతరం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పతనమై, 34253 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా భారీగా 316 పాయింట్లు కుప్పకూలింది. ఒక్కసారిగా 10,300 మార్కు కిందకి వచ్చి చేరింది. ఇక మార్కెట్ అవర్స్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 792 పాయింట్లు నష్టపోయి 34,376 వద్ద, నిఫ్టీ 283 పాయింట్లు పతనమై 10,316 వద్ద క్లోజయ్యాయి.
రూపాయి సైతం ఆర్‌బీఐ ప్రకటన తర్వాత చారిత్రాత్మక కనిష్ట స్థాయి 74ను తాకింది. 2019 మార్చిలో క్వార్టర్ వరకు ద్రవ్యోల్బణ 4.5 శాతానికి పెరుగుతుందని ఆర్‌బీఐ అంచనావేసింది. నిఫ్టీ ఇండెక్స్‌లో మెజార్టీ స్టాక్స్ నష్టాల్లోనే నడిచాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ, గెయిల్, ఓఎన్‌జీసీలు దాదాపు 25 శాతం వరకు క్షీణించాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ మేర పడిపోవడానికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ ధరలపై నిన్న కేంద్ర ప్రభుత్వం రూ.2.50 కోత పెట్టడమే. కేవలం భారతీ ఇన్‌ఫ్రాటెల్, టైటాన్, ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్‌లు మాత్రమే 1.25 శాతం నుంచి 2.50 శాతం మధ్యలో లాభపడ్డాయి.
ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతు ప్రకటన చేయడం కరెన్సీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని ఐఐఎఫ్‌ఎల్ సెక్యురిటీస్ రీసెర్చ్ హెడ్ అభిమాన్యు సోఫట్ చెప్పారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, దాని నుంచి కాపాడేందుకు రేట్లను పెంచుతుందని భావించామని తెలిపారు. ఒకవేళ క్రూడాయిల్ ధరలు ఇలానే పెరుగుతూ ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్‌బీఐ రేట్లను పెంచాల్సిందేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment