ఫలితాలు, పార్లమెంట్ సమావేశాలు కీలకం
♦ ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ ఫలితాల ప్రభావం
♦ వర్షపాత విస్తరణ కూడా కీలకమే
♦ ఈ వారం మార్కెట్‌పై నిపుణులు..
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వారంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, విప్రో వంటి బ్లూ చిప్ కంపెనీల తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెలువడనున్నాయి. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరు, ఈ వారం వెలువడే బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు వర్షపాత విస్తరణ తదితర అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ముడి చమురు ధరల గమనం, తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్‌పై తగిన ప్రభావం చూపుతాయని క్యాపిటల్‌వయా రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు.
అందరి కళ్లూ జీఎస్‌టీ బిల్లుపైనే
అందరి కళ్లూ వస్తు, సేవల పన్ను(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-జీఎస్‌టీ)బిల్లుపైనే ఉన్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందుతుందనే అంచనాలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. సోమవారం నాటి ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ సూచీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాలకు స్పందనగా ట్రేడవుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ క్యూ1 ఫలితాలు వెలువడ్డాయి. కంపెనీ నికర లాభం అంచనాలను మించి 18% వృద్ధి సాధించింది.
కీలక బ్లూ చిప్ కంపెనీల ఫలితాలు...
ఇక ఈ వారం ఫలితాల విషయానికొస్తే, ఈ నెల 18న (సోమవారం) హిందుస్తాన్ యునిలివర్, 19న (మంగళవారం) అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, 21న(గురువారం) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెయిర్న్ ఇండియా, శుక్రవారం(22న) యాక్సిస్ బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇన్వెస్టర్లు పరిశీలిస్తారని సింఘానియా పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, గురువారం (ఈ నెల 21) యూరోపియన్ కేంద్ర బ్యాంక్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్నది.
గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 710 పాయింట్లు లాభపడి 27,837 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 218 పాయింట్లు లాభపడి 8,541 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు చెరో 2.6 శాతం చొప్పున లాభపడ్డాయి.