మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజులపాటు లాభాల స్వీకరణ పేరుతో జరిగిన కరెక్షన్ నుంచి వెనువెంటనే మార్కెట్ తేరుకుని, కొత్త రికార్డుస్థాయికి పరుగులు తీయడం అనూహ్యం. మూడేళ్ల నుంచి ఈక్విటీలకు మోహం చాటేసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు తాజా పెట్టుబడులకు వేచిచూడలేక, చిన్నపాటి సర్దుబాటులో కూడా కొనేస్తున్నారంటే, ఈ ర్యాలీ మరిన్ని వారాలు కొనసాగవచ్చని అంచనావేయవచ్చు. మే చివరివారంలో కరెక్షన్ జరిగిన సందర్భంగా మార్కెట్ టర్నోవర్‌తో పోలిస్తే గతవారపు ర్యాలీలో టర్నోవర్ రెట్టింపయ్యింది. ఇన్వెస్టర్ల కొనుగోలు ఆసక్తిని ఈ టర్నోవర్ ధృవపరుస్తోంది. అలాగే సూచీల బ్రేక్‌అవుట్ కూడా నిజమైనదేనని, రానున్న వారాల్లో ఇవి మరింత పెరగవచ్చని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి.
సెన్సెక్స్ సాకేంతికాంశాలు...
జూన్ 13తో ముగిసిన వారంలో 25,735 పాయింట్ల కొత్త రికార్డుస్థాయికి చేరిన సెన్సెక్స్, అటుతర్వాత లాభాల స్వీకరణ ఫలితంగా 21,171 పాయింట్ల స్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోల్చితే 168 పాయింట్ల స్వల్పనష్టంతో 25,228 పాయింట్ల వద్ద ముగిసింది. గత సోమవారం సెన్సెక్స్ పెద్ద ర్యాలీ జరిపి 25,600 స్థాయిని దాటినా, వరుసగా ఐదురోజులపాటు 25,600-25,700 శ్రేణి వద్ద అవరోధాన్ని చవిచూసింది.
ఈ కారణంగా రానున్న రోజుల్లో సెన్సెక్స్ ర్యాలీ కొనసాగాలంటే ఈ శ్రేణిని అధిగమించి ముగియాల్సివుంటుంది. అలా ముగిస్తే 26,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించవచ్చు. మధ్యలో 25,850 స్థాయి తాత్కాలికంగా నిరోధించవచ్చు. ఈ వారం మార్కెట్ బలహీనంగా మొదలైతే 25,044-25,129 పాయింట్ల శ్రేణి తక్షణ మద్దతు (6వ తేదీనాటి గ్యాప్) అందించవచ్చు. ఈ శ్రేణిని ముగింపులో కోల్పోతే దిగువన మద్దతు స్థాయిలు 24,926 పాయింట్లు, 24,645 పాయింట్లు.
నిఫ్టీ మద్దతు శ్రేణి 7,484-7,497
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ జూన్ 13తో ముగిసినవారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించినట్లు 7,700 పాయింట్ల శిఖరం వద్ద స్వల్ప అవరోధాన్ని ఎదుర్కొని 7,525 పాయింట్ల వద్దకు తగ్గింది. చివరకు అంత క్రితం వారంతో పోల్చితే 41 పాయింట్ల నష్టంతో 7,542 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం హెచ్చుతగ్గుల సందర్భంగా నిఫ్టీకి పైస్థాయిలో 7,600 వద్ద అవరోధం కలగవచ్చు. దిగువన 7,484-7,497 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది.
జూన్ 6న మార్కెట్ గ్యాప్‌అప్‌తో మొదలైన సందర్భంగా ఏర్పడిన ఈ గ్యాప్ సమీప భవిష్యత్తులో నిఫ్టీకి కీలకం. ఈ గ్యాప్ మద్దతును ముగింపులో కోల్పోతే క్రమేపీ 7,430 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ లోపున మరో ముఖ్యమైన మద్దతుస్థాయి 7,360 పాయింట్లు. ఈ వారం పైన ప్రస్తావించిన గ్యాప్ మద్దతుస్థాయిని పరిరక్షించుకుని, 7,600 పాయింట్ల అవరోధాన్ని అధిగమిస్తే మరోసారి 7,680-7,700 శ్రేణిని పరీక్షించవచ్చు. ఆపైన స్థిరపడితే రానున్న రోజుల్లో 7,800-7,850 పాయింట్ల శ్రేణికి పెరగవచ్చు.
అవరోధ శ్రేణి 25,600-25,700
Published Mon, Jun 16 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM
Advertisement
Advertisement