సిరియాపై అమెరికా దాడి: మార్కెట్లు ఢమాల్
Published Fri, Apr 7 2017 4:01 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
ముంబై : అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో నెగిటివ్ గా ప్రారంభమైన మార్కెట్లు చివరికి మరింత నష్టాల్లోకి దిగజారాయి. సెన్సెక్స్ 220 పాయింట్ల మేర నష్టోయి 29,706 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ అయితే కీలకమైన మార్కు 9200 కంటే కిందకి పడిపోయింది. 63.65 పాయింట్ల నష్టంతో 9198 వద్ద క్లోజ్ అయింది. సిరియా బేస్ పై అమెరికా క్షిపణి దాడులు నిర్వహించడంతో గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గత ఆరేళ్లుగా అంతర్యుద్ధంతో బాధపడుతున్న సిరియా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో, మార్కెట్లు వెనుకకు జంకాయి. నేటి ట్రేడింగ్ లో 258 పాయింట్ల మేర సెన్సెక్స్ పడిపోయింది. ఇంట్రాడేలో నిఫ్టీ 9188 పాయింట్ల కిందకి దిగజారింది. ఆసియన్ మార్కెట్లలో స్టాక్స్ అతలాకుతలమవుతుండగా.. సురక్షిత ఆస్తులైన బాండ్లు, యెన్, గోల్డ్ లవైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు.
మరోవైపు ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థలు అమెరికా, చైనాల మధ్య వాణిజ్యపరమైన సదస్సు జరుగబోతుంది. ఇటీవల ఈ రెండు దేశాలకు అసలు పడటం లేదు. అమెరికా క్షిపణి దాడులతో గ్లోబల్ గా ఆయిల్ ధరలు 2 శాతం పైకి ఎగిశాయి. అయితే ఆయిల్ ధరలు మరింత పైకి వెళ్లవని, సిరియా ఆయిల్ ఉత్పత్తిలో అంతకీలకమైన దేశమేమీ కాదని విశ్లేషకులంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లు పడిపోతుండటం కొనుగోళ్లకు మంచి అవకాశమని జేవీ క్యాపిటల్ సర్వీసెస్ సజీవ్ ధావన్ చెప్పారు. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 29 పైసలు బలపడి 64.25 గా నమోదైంది. బంగారం ధరలు 139 రూపాయలు పైకి ఎగిసి, 28,860గా ట్రేడయ్యాయి.
Advertisement
Advertisement