లాభాల స్వీకరణకు అవకాశం
⇒పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలపై దృష్టి
⇒రూపాయి మారక విలువ,ముడి చమురు ధరలూ కీలకమే...
⇒ఈ వారం మార్కెట్ కదలికలపై నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: ఇటీవల సరికొత్త రికార్డులను తాకుతూ సాగుతున్న మార్కెట్లో ఈ వారం లాభాల స్వీకరణ జరిగే అవకాశముందని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. గడిచిన వారం కూడా అమ్మకాలతో మార్కెట్ కొంతమేర వెనకడుగు వేసిన నేపథ్యంలో తాజా విశ్లేషణకు ప్రాధాన్యత ఏర్పడింది. 6 వారాల తరువాత మళ్లీ సెన్సెక్స్ గత వారం 236 పాయింట్లు కోల్పోయి 28,458 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
కాగా, అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) తోపాటు, నవంబర్‌లో రిటైల్‌ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు ఈ వారం విడుదల కానున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో మార్కెట్ హెచ్చుతగ్గులను చవిచూసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 12న (శుక్రవారం) అక్టోబర్ నెలకు ఐఐపీ, నవంబర్ నెలకు సీపీఐ గణాంకాలు వెలువడనున్నాయి. వీటితోపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ పేర్కొన్నారు. నవంబర్ 24న మొదలైన శీతాకాల సమావేశాలు ఈ నెల 23న ముగియనున్నాయి. ఈ సమావేశాల ఫలితాలకు ప్రాధాన్యత ఉన్నదని జయంత్ తెలిపారు.
విదేశీ పెట్టుబడులు
దేశీ మార్కెట్లను ముంచెత్తుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, ఐదేళ్ల కనిష్టానికి దిగివచ్చిన ముడిచమురు ధరలు సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతాయని అత్యధిక శాతం మంది నిపుణులు విశ్లేషించారు. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి కదలికలు కూడా కీలకంగా నిలవనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి వెలువడనున్న మరిన్ని విధాన ప్రకటనలపై ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నట్లు క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఎంటీ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఇప్పటికే వేడెక్కిన పార్లమెంట్ సమావేశాలు, ఇకపై ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సంస్కరణలు వంటి అంశాలు సమీప కాలంలో మార్కెట్లను నియంత్రిస్తాయని గుప్తా పేర్కొన్నారు.
మరో రెండు సెషన్లు...: ప్రభుత్వ విధానాలు, సంస్కరణలపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు ఈ వారం కూడా కొంతమేర అమ్మకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు. ఇప్పటికే లాభాల స్వీకరణవైపు మొగ్గిన ఇన్వెస్టర్లు రానున్న ఒకటి రెండు సెషన్లపాటు అమ్మకాలు కొనసాగించవచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే స్టీల్ రంగ దిగ్గజం సెయిల్‌లో ప్రభుత్వం చేపట్టిన డిజిన్వెస్ట్‌మెంట్ విజయవంతంకావడం సెంటిమెంట్‌కు జోష్‌నిస్తుం దని నిపుణులు పేర్కొన్నారు. ఇది మార్కెట్‌పట్ల రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తిని తెలియజేస్తున్నదని వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధిపై ఆశావహ అంచనాలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడుల జోరు వంటి అంశాలు మార్కెట్లకు అండగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
రిటైల్ ఇన్వెస్టర్ల కోటా రెట్టింపు
ఇక డిజిన్వెస్ట్‌మెంట్‌లో 20% వాటా
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చేపట్టనున్న ప్రభుత్వ సంస్థల వాటా ఉపసంహరణలో రిటైల్ ఇన్వెస్టర్లకు 20%ను కేటాయించనుంది. దీంతో ప్రస్తుతం అమలవుతున్న 10% కోటా రెట్టింపుకానుంది. ఈ అంశాన్ని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. గత వారం చివర్లో నిర్వహించిన సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్‌కు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన స్పందన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వెలువడటం గమనార్హం. తదుపరి దశలో ప్రభుత్వం ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా వంటి బ్లూచిప్స్‌తోపాటు, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఎన్‌హెచ్‌పీసీ వంటి దిగ్గజాలతో సైతం వాటాల విక్రయాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఓఎన్‌జీసీలో 5%, కోల్ ఇండియాలో 10% చొప్పున వాటాలు విక్రయించనుంది.
రూ. లక్ష కోట్లకు విదేశీ పెట్టుబడులు వరుసగా మూడో ఏడాది...
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో మరో విశేషం చోటుచేసుకుంది. ఈ ఏడాది(2014) జనవరి 1 మొదలు డిసెంబర్ 5 వరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈక్విటీలలో నికరంగా రూ. లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇందుకు రికార్డులు సృష్టిస్తూ సాగుతున్న మార్కెట్లు, సంస్కరణలతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం, పుంజు కుంటున్న ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో 16.57 బిలియన్ డాలర్లను(రూ. లక్ష కోట్లు) ఇన్వెస్ట్ చేశారు.
వీటిలో డిసెంబర్ తొలి వారంలో లభించిన రూ. 4,032 కోట్ల పెట్టుబడులు కలసి ఉన్నాయి. ఇక మరోవైపు ఇదే కాలంలో ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్లో మరింత అధికంగా రూ. 1.55 లక్షల కోట్లను(25.6 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. వెరసి దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్‌పీఐల మొత్తం పెట్టుబడులు రూ. 2.55 లక్షల కోట్లను(42 బిలియన్ డాలర్లు) తాకాయి! కాగా, ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో 2013లో రూ. 1.13 లక్షల కోట్లు, 2012లో రూ. 1.28 లక్షల కోట్లు చొప్పున కుమ్మరించారు. 2010లో మాత్ర మే వీటిని మించుతూ రికార్డు స్థాయిలో రూ. 1.33 లక్షల కోట్లను ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేశారు.