బుల్లిష్ జోరుతో ప్రారంభంలో మార్కెట్లు సరికొత్త రికార్డు స్థాయిలను నమోదుచేశాయి.
మొదటిసారి 9,900 తాకిన నిఫ్టీ
Published Fri, Jul 14 2017 9:40 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
ముంబై: బుల్లిష్ జోరుతో ప్రారంభంలో మార్కెట్లు సరికొత్త రికార్డు స్థాయిలను నమోదుచేశాయి. నిఫ్టీ మొదటిసారి 9,900కు తాకింది. అయితే ఈ జోరు ఎంతో సేపు నిలువలేదు. వెనువెంటనే మార్కెట్లు నష్టాలోకి జారుకున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 14.60 పాయింట్ల నష్టంలో 9,877 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ సైతం 35.15 పాయింట్ల నష్టంలో 32,002 వద్ద కొనసాగుతోంది. టెక్ దిగ్గజం టీసీఎస్ నిన్న మార్కెట్ అవర్స్ తర్వాత ప్రకటించిన ఫలితాల్లో నిరాశపరిచే సరికి ఆ కంపెనీ షేర్లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. రెండో టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా నేటి మార్కెట్ అవర్స్‌కు ముందు తన ఫలితాలను ప్రకటించింది. ఇది కూడా లాభాల్లో పడిపోయినప్పటికీ, విశ్లేషకుల అంచనాలు బీట్ చేయడంతో ఇన్ఫీ షేర్లు 3 శాతం లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.
ఓ వైపు వ్యవస్థాపకులు, మేనేజ్‌మెంట్ మధ్య వివాదం, మరోవైపు వీసా కష్టాలు, వ్యయాల పెరుగుదల ఉన్నప్పటికీ ఇన్ఫీ కొంత మెరుగైన ప్రదర్శననే కనబర్చినట్టు విశ్లేషకులు చెప్పారు. కాగ, ఇన్ఫీ లాభాలు 3.3 శాతం పడిపోయి రూ.3,483 కోట్లగా నమోదుకాగ, టీసీఎస్ లాభాలు 5.9 శాతం కిందకి దిగజారి రూ.5,945కోట్లగానే ఉన్నాయి. ఇన్ఫోసిస్‌తోపాటు అదానీ పోర్ట్స్, అరబిందో ఫార్మాలు లాభాలు కొనసాగుతుండగా...టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏసియన్ పేయింట్స్ టాప్ లూజర్లుగా నష్టాలు గడిస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 64.45 గా ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా 10 రూపాయలు పడిపోయి 27,841 రూపాయల వద్ద ఉన్నాయి.
Advertisement
Advertisement