మార్కెట్లకు జీడీపీ ‘కోత’! | Sensex plunges 434 points, Nifty plummets 139 points | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు జీడీపీ ‘కోత’!

Published Sat, Oct 5 2019 5:02 AM | Last Updated on Sat, Oct 5 2019 5:02 AM

Sensex plunges 434 points, Nifty plummets 139 points - Sakshi

పరపతి విధాన సమీక్ష సందర్భంగా రిజర్వ్‌ బ్యాంక్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను భారీగా తగ్గించడం(6.9% నుంచి 6.1 శాతానికి) దేశీ స్టాక్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల స్టాక్స్‌లో అమ్మకాలు జరగడంతో కీలక సూచీలు కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ 434 పాయింట్లు క్షీణించి 37,674 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 134 పాయింట్లు క్షీణించి 11,175 పాయింట్ల దగ్గర ముగిశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 770 పాయింట్ల శ్రేణిలో తిరుగాడింది. ఇంట్రాడేలో 37,633 (కనిష్టం), 38,404 పాయింట్ల (గరిష్టం) మధ్య తిరిగింది. సెన్సెక్స్‌ సుమారు 300 పాయింట్ల పైగా లాభంతో మొదలైనా.. వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ విధానాన్ని ప్రకటించడంతో... లాభాలన్నీ కోల్పోయింది. ఈ వారంలో సెన్సెక్స్‌ 1,149 పాయింట్లు (2.96%), నిఫ్టీ 338 పాయింట్లు (2.93%) క్షీణించాయి.

‘రేట్ల కోత, ఉదార ద్రవ్య విధానాల కొనసాగింపు సంకేతాలు వచ్చినప్పటికీ మార్కెట్లు.. ముఖ్యంగా బ్యాంకులు ప్రతికూలంగా స్పందించాయి. తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాలను సత్వరం ఖాతాదారులకు బదలాయించాల్సి రానుండటం వల్ల బ్యాంకుల మార్జిన్లపై ఒత్తిడి పెరగనుండటమే ఇందుకు కారణం. ఇక ఆర్థిక వృద్ధి అంచనాలు కూడా ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. ఎకానమీ వృద్ధికి ఊతమిచ్చేలా ద్రవ్యపరమైన చర్యలు తీసుకోవడానికి ఆర్‌బీఐకి వెసులుబాటు పరిమితంగానే ఉంది‘ అని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గౌరవ్‌ దువా తెలిపారు.

కీలక షేర్లు 3% పైగా డౌన్‌..
సెన్సెక్స్‌లోని కోటక్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్‌ బ్యాంక్‌ మొదలైనవి 3.46 శాతం దాకా క్షీణించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రా మొదలైనవి 1.03 శాతం దాకా పెరిగాయి.

వడ్డీ రేట్ల ప్రభావిత స్టాక్స్‌ క్షీణత..
వడ్డీ రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండే స్టాక్స్‌ గణనీయంగా తగ్గాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ స్టాక్స్‌ 5 శాతం దాకా క్షీణించాయి. ఫెడరల్‌ బ్యాంక్‌ 3.82%, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 3.46%, ఐసీఐసీఐ బ్యాŠంక్‌ 3.17%, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 2.82 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.79% తగ్గాయి. దీంతో బీఎస్‌ఈ బ్యాంకెక్స్‌ సూచీ 2.45% క్షీణించింది. రియల్టీలో ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్టŠస్‌ 5.28%, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ 3.61 శాతం క్షీణించాయి. ఆటో సూచీలో ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ 3.14 శాతం, బాష్‌ 2.88 శాతం పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement