
ఆద్యంతం స్తబ్దుగా, పరిమిత శ్రేణిలో సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో వరుసగా నాలుగో రోజూ స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎమ్‌పీసీ) సమావేశం ఆరంభమైన నేపథ్యంలో మార్కెట్లో అప్రమత్తత నెలకొన్నది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 34 పాయింట్లు లాభపడి 36,617 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 10,934 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్టీ, లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోగా, వాహన, ఆర్థిక రంగ, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు లాభపడ్డాయి.
233 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్....
ఆర్‌బీఐ ఎమ్‌పీసీ సమావేశం మంగళవారం ఆరంభమైంది. రేట్లపై నిర్ణయం గురువారం వెల్లడి కానున్నది. ద్రవ్యోల్బణం దిగువ స్థాయిల్లో ఉన్నందున ఆర్‌బీఐ వైఖరి ‘తటస్థ’ విధానానికి మారవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. స్వల్ప లాభాలతో ఆరంభమైన సెన్సెక్స్ ఆ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ముడి చమురు ధరలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 87 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ తర్వాత కోలుకొని మళ్లీ లాభాల బాట పట్టింది. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ఆరంభం కావడంతో ఒక దశలో 146 పాయింట్లు పెరిగింది. మొత్తం మీద రోజంతా 233 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 25 పాయింట్లు పతనం కాగా మరో దశలో 45 పాయింట్లు పెరిగింది.
కొనసాగిన ఆర్‌కామ్ నష్టాలు...
దివాళా పిటీషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ పతనం కొసాగింది. సోమవారం 35 శాతం క్షీణించిన ఈ షేర్ మంగళవారం 29 శాతం పడిపోయి రూ.5.44 వద్ద ముగిసింది. మొత్తం మూడు రోజుల్లో ఈ షేర్ 54 శాతం పడిపోయింది. అనిల్ అంబానీకి చెందిన ఇతర గ్రూప్ షేర్లు కూడా భారీగానే నష్టపోయాయి. రిలయన్స్ పవర్ 30 శాతం, రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ 13 శాతం చొప్పున నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment