
బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 143 పాయింట్లు పతనమై 36,594 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,768 పాయింట్ల వద్ద ముగి శాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆర్థిక రికవరీపై ఆందోళనతో ఆసియా మార్కెట్లు పతనం కావడం, డాలర్ తో రూపాయి మారకం విలువ 21 పైసలు క్షీణించి 75.20 చేరడం, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం.. ప్రతికూల ప్రభావం చూపించాయి. వారం పరంగా చూస్తే స్టాక్ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 573 పాయింట్లు, నిఫ్టీ161 పాయింట్ల మేర పెరిగాయి.
చివర్లో తగ్గిన నష్టాలు....
ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ నష్టాల్లోనే మొదలైంది. గంటలోపే రికవరీ అయి లాభాల్లోకి వచ్చింది. పట్టుమని పది నిమిషాలు కూడా ఈ లాభాలు కొనసాగలేదు. ఇక ఆతర్వాత రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో 11 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 337 పాయింట్లు పతనమైంది. ఇంట్రాడే నష్టాలు ట్రేడింగ్ చివర్లో తగ్గాయి. ఆర్‌ఐఎల్ లాభపడటంతో నష్టాలకు కళ్లెం పడింది.
► రిలయన్స్ జోరు కొనసాగుతోంది. రూ.1,884 వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకిన ఈ షేర్ చివరకు 3% లాభంతో రూ.1,879 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. బీపీతో జేవీను ఏర్పాటు చేయడం, ఈ నెల 15న జరిగే కంపెనీ ఏజీఎమ్‌లో భారీ ప్రకటనలు ఉండొచ్చన్న అంచనాలు దీనికి నేపథ్యం.
► రూ.8,000 కోట్లు సమీకరిస్తున్న కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో రూ.8,000 కోట్ల మేర నిధులు సమీకరించ నున్నది. టైర్–1 బాసెల్ త్రి బాండ్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరిస్తామని కెనరా బ్యాంక్ తెలిపింది.
► యస్‌బ్యాంక్ ఎఫ్‌పీఓ ఫ్లోర్ ప్రైస్ రూ.12
యస్‌బ్యాంక్ తన ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) ఫ్లోర్‌ప్రైస్‌ను రూ.12గా నిర్ణయించింది. శుక్రవారం నాటి ముగింపు ధర(రూ.25)తో పోల్చితే ఇది 55 శాతం తక్కువ.
Comments
Please login to add a commentAdd a comment