
షేర్‌ఖాన్ ఇక... బీఎన్‌పీ పారిబా పరం
షేర్‌ఖాన్ బ్రోకరేజ్ సంస్థను కొనుగోలు చేయాలన్న బీఎన్‌పీ పారిబా ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది.
* ఆమోదం తెలిపిన సీసీఐ
* డీల్ విలువ రూ.2,000 కోట్లు!
న్యూఢిల్లీ: షేర్‌ఖాన్ బ్రోకరేజ్ సంస్థను కొనుగోలు చేయాలన్న బీఎన్‌పీ పారిబా ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్‌పీ పారిబా తన రిటైల్ బ్రోకింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్‌ను కొనుగోలు చేయనున్నామని గత ఏడాది జూలైలో వెల్లడించింది. ఈ కొనుగోలు వల్ల దేశంలో పోటీ విషయమై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని భావించిన సీసీఐ ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు ట్వీట్ చేసింది.
ఈ డీల్ విలువ రూ.2,000 కోట్లుగా అంచనా. ముంబై కేంద్రంగా 2000 సంవత్సరం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న షేర్‌ఖాన్ సంస్థకు ప్రస్తుతం 12 లక్షల మంది క్లయింట్లున్నారు. ఇక బీఎన్‌బీ పారిబా సంస్థ భారత్‌లో కార్పొరేట్, రిటైల్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలందిస్తోంది. భారత రిటైల్ బ్రోకింగ్ విషయంలో బీఎన్‌బీకి ఇది రెండో అతిపెద్ద కొనుగోలు. 2007లో మరో బ్రోకింగ్ సంస్థ జియోజిత్ సెక్యూరిటీస్‌లో 34 శాతం వాటాను బీఎన్‌పీ కొనుగోలు చేసింది.