న్యూఢిల్లీ : కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పెట్రోల్, డీజిల్ కార్ల వాడుకం నిషేధం దిశగా ప్రపంచం కదులుతోంది. పెట్రోల్, డీజిల్ వాడుకాన్ని పూర్తిగా నిరోధించి, కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. భారత్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలంటే ఇంకా 30 ఏళ్లు పట్టేలా కనిపిస్తోంది. భారత్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్‌తో రూపొందే కొత్త వాహనాల విక్రయాలకు 2047 ఏడాది వరకు సమయం పడుతుందని ఆటోమొబైల్ ఇండస్ట్రి బాడీ సియామ్ ప్రతిపాదించింది. అదేవిధంగా ఇంట్రా-సిటీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్లీట్‌ను 2030 వరకు సాధించవచ్చని వెల్లడించింది. 2030 వరకు 40 శాతం కొత్త వాహనాల విక్రయాలు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో రూపొందేవిగా ఉండాలని సియామ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. దీనిపై ప్రభుత్వానికి ఓ పత్రం కూడా నివేదించినట్టు పేర్కొంది.
పబ్లిక్ మొబిలిటీ కోసం 100 శాతం ఎలక్ట్రిక్ అందించేలా ప్రభుత్వ విజన్‌కు అనుకూలంగా పనిచేస్తున్నామని, 2030 వరకు వ్యక్తిగత అవసరాల కోసం వాడే మొబిలిటీలో 40 శాతం ఎలక్ట్రిక్‌వే ఉండబోతున్నట్టు సియామ్ తెలిపింది. 2030 వరకు ఒక్క పెట్రోల్ లేదా డీజిల్ కారును దేశంలో విక్రయించబోమని ఈ ఏడాది ఏఫ్రిల్‌లో విద్యుత్ శాఖ మాజీ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే భారత్ స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను అందించే రోడ్‌మ్యాప్‌ను సియామ్ ప్రతిపాదించింది. ప్రభుత్వం, ఇండస్ట్రి, వివిధ వాటాదారులు కలిసి పనిచేయాలని, 100 శాతం అంకితభావంతో పెట్టుబడులు పెట్టాలని సియామ్ అధ్యక్షుడు అభయ్ ఫిరోడియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment