
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు సిప్..సిప్.. హుర్రే అంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లు సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు సిప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.5,600 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో సిప్‌ల ద్వారా ఫండ్స్‌లోకి వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్స్(రూ.3,434 కోట్లు)తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో సిప్‌ల ద్వారా ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబులు 64 శాతం వృద్ధి చెందాయని పేర్కొంది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఫండ్స్‌లో సిప్ పెట్టుబడులు రూ.5,516 కోట్లుగా ఉన్నాయని వివరించింది.
సగటు సిప్ పెట్టుబడి రూ.3,250
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో సిప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన మదుపులు.. మొత్తం రూ.34,887 కోట్లుగా ఉన్నాయని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన పెట్టుబడులు రూ.23,584 కోట్లని యాంఫీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున కొత్తగా 8.86 లక్షల సిప్ ఖాతాలు జత అవుతున్నాయని, ఒక్కో సిప్ సగటు పెట్టుబడి రూ.3,250గా ఉందని పేర్కొంది.ప్రస్తుతం 1.73 కోట్లు సిప్ ఖాతాలున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధించి ఆందోళన చెందాల్సిన పని లేకుండా సిప్‌లు ఇన్వెస్టర్లకు భరోసానిస్తున్నాయని యాంఫీ పేర్కొంది. క్రమశిక్షణగా మదుపు చేయడం, యావరేజ్ ప్రయోజనాలు సిప్‌ల ద్వారా లభిస్తున్నాయని వివరించింది.
స్టాక్ మార్కెట్ జోరుతోనే...
స్టాక్ మార్కెట్ జోరుగా ఉండటంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి సిప్ పెట్టుబడులు జోరుగావస్తున్నాయని బజాజ్ క్యాపిటల్ సీఈఓ రాహుల్ పారిఖ్ చెప్పారు. యాంఫీ, మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తున్న ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమాలు కూడా సిప్‌లు పెరగడానికి తోడ్పడుతున్నాయని వివరించారు. స్టాక్ మార్కెట్లో నష్టభయాన్ని తగ్గించుకోవటానికి ఇన్వెస్టర్లు సిప్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
సిప్ అంటే...
రిటైల్ ఇన్వెస్టర్లు ఒకేసారి పెద్ద మొత్తాల్లో కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో వారానికి/నెలకు/ మూడు నెలలకొకసారి చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌గా వ్యవహరిస్తారు. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ తరహా ఇన్వెస్ట్‌మెంట్ లాంటిదే.
Comments
Please login to add a commentAdd a comment