మీరు అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో కాస్త తక్కువ ధరకు వస్తోంది కదా అని ‘ఐఫోన్’ కొన్నారు. అది మీకు అనుకున్న సమయంలోనే డెలివరీ అయింది. ఫోన్ చూడటానికి చాలా బాగుంది. వాడుతున్నపుడు కూడా బాగుంది. కాకపోతే ఓ ఐదు వారాలు గడిచాక చిన్న రిపేపు వచ్చింది. ఏమైందో తెలుసుకుందామని సర్వీస్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ దాన్ని విప్పి చూసిన సర్వీస్ సెంటర్ సిబ్బంది... అది నకిలీదని చెప్పారు. మీరేం చేస్తారు? మీరు కొన్న ఈ– కామర్స్ సంస్థకు తిరిగి ఇచ్చేద్దామంటే అప్పటికే రిటర్న్ చేయటానికిచ్చిన గడువు అయిపోయింది. పోనీ యాపిల్ ఆథరైజ్డ్ డీలర్‌ను అడుగుదామనుకుంటే మీరు కొన్నది ఆన్‌లైన్లో... వారికెలాంటి సంబంధం ఉండదు. మీకు అమ్మిన వ్యక్తినో, సంస్థనో అడిగితే... తనకు ఈ–కామర్స్ సంస్థ నుంచి డబ్బులొచ్చేశాయి కనక జవాబుండదు. మరేం చేస్తారు..? మోసపోవాల్సిందేనా..? ఇదంతా ఇపుడెందుకంటే... తమ బ్రాండ్ పేరిట నకిలీ ఉత్పత్తులు విక్రయించారంటూ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై అమెరికాకు చెందిన పాదరక్షల దిగ్గజం ‘స్కెచర్స్’ కేసు వేసింది. ఇలాంటి వ్యవహారాలపై ఈ–కామర్స్ సంస్థలేమంటున్నాయి? సెల్లర్స్ ఏమంటున్నారు? కస్టమర్లు ఏం చేయాలి? వీటిలో ఎవరి బాధ్యత ఎంత? వీటన్నింటినీ వివరించేదే ఈ ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
హైదరాబాద్, న్యూఢిల్లీ– సాక్షి బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’పై అమెరికాకు చెందిన అథ్లెటిక్ ఫుట్‌వేర్ బ్రాండ్ ‘స్కెచర్స్’ కేసు వేసింది. నకిలీ వస్తువుల విక్రయానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు దాఖలు చేసింది. తన బ్రాండ్ నకిలీ ప్రొడక్టులను విక్రయించినందుకు రిటైల్ నెట్, టెక్ కనెక్ట్, యూనికెమ్ లాజిస్టిక్స్, మార్కో వేగన్ అనే సెల్లర్స్‌పై కూడా కేసులు పెట్టింది. కోర్టు నియమించిన స్థానిక కమిషనర్ల సాయంతో ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని ఏడు గిడ్డంగులపై దాడి చేసి నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు స్కెచర్స్ తెలియజేసింది. ఈ నలుగురు సెల్లర్స్ దాదాపు 15,000 జతలకు పైగా తమ బ్రాండ్ నకిలీ ‘షూ’లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులకు విక్రయించినట్లు స్కెచర్స్ ఆరోపించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి మాత్రం దీంట్లో తమ బాధ్యత లేదని స్పష్టంచేశారు. కస్టమర్లకు, సెల్లర్స్‌కు మధ్య తాము కేవలం మధ్యవర్తిగా మాత్రమే ఉంటామని చెప్పారాయన. ఈ–కామర్స్ సంస్థల ద్వారా నకిలీ ఉత్పత్తులు విక్రయించినట్లు ఆరోపణలు రావటం ఇది మొదటిసారి కాదు. గత మూడేళ్లలో చూస్తే.. టామీ హిల్‌ఫిగర్, లాకోస్ట్, కెల్విన్ క్లీన్, లెవీస్, సూపర్‌డ్రై వంటి సంస్థలు వేర్‌హౌస్‌లపై దాడి చేసి నకిలీ ఉత్పత్తులను అడ్డుకున్నాయి.
వస్తువును పర్యవేక్షించే వ్యవస్థ ఎక్కడుంది?
ఈ–కామర్స్ వ్యాపారం ఎలా నడుస్తుందంటే... కస్టమర్ ఏదైనా ప్రోడక్టును ఆన్‌లైన్‌లో బుక్ చేయగానే ఆ సమాచారం ఈ–కామర్స్ కంపెనీ ద్వారా దాన్ని విక్రయించే సెల్లర్‌కు వెళుతుంది. సెల్లర్ ఆ ఉత్పాదనను కస్టమర్‌కు కొరియర్ ద్వారా పంపిస్తాడు. కస్టమర్ చెల్లించిన డబ్బులు సెల్లర్‌కు కాకుండా ఈ–కామర్స్ కంపెనీకి చేరతాయి. రిటర్న్ పాలసీ ప్రకారం... ఉత్పత్తి నచ్చకపోయినా, నాణ్యత లేకున్నా ఉత్పాదనను బట్టి గరిష్ఠంగా 30 రోజుల్లో వెనక్కిచ్చి మరొకటి పొందవచ్చు. లేదా తన సొమ్ము తను పొందవచ్చు. ఎందుకంటే రిటర్న్ గడువు ముగిసేదాకా... కస్టమర్ చెల్లించిన మొత్తం ఈ–కామర్స్ సంస్థ ఖాతాలోనే ఉంటుంది. రిటర్న్ గడువు ముగిశాకే ఆ డబ్బు సెల్లర్ ఖాతాలోకి వెళ్తాయి.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. కస్టమర్‌కు సెల్లర్ నుంచి ఉత్పత్తి చేరడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి... నేరుగా విక్రేతే కొరియర్ ద్వారా కస్టమర్‌కు పంపించటం. రెండోది.. విక్రేత ఆ ఉత్పత్తిని ఈ–కామర్స్ కంపెనీకి పంపిస్తాడు. అది ఈ–కామర్స్ కంపెనీ గిడ్డంగిని చేరి... అక్కడి నుంచి కస్టమర్‌కు వస్తుంది. నిజానికి సెల్లర్ నేరుగా కస్టమర్‌కు ఉత్పత్తిని పంపేటపుడు అది నకిలీదా, అసలైనదా అని పర్యవేక్షణ చేసే అవకాశం ఈ–కామర్స్ కంపెనీకి ఎటూ ఉండదు. ఇక గిడ్డంగికి వచ్చే వస్తువుల్ని పర్యవేక్షించే అవకాశం ఉన్నా... అక్కడా అలాంటిదేమీ జరగటం లేదన్నది సెల్లర్ల మాట. ‘‘సెల్లర్ నుంచి గిడ్డంగికి చేరిన ఉత్పాదనలకు సీల్ ఉందా లేదా అని మాత్రమే అక్కడి సిబ్బంది చూస్తున్నారు. మా నుంచి 2 శాతం కమిషన్ తీసుకుని గిడ్డంగుల్లో సరుకు నిల్వ చేస్తారు. ప్యాక్‌లో ఉత్పాదన ఉందా లేదా, అసలుదా / నకిలీదా అని చూసే వ్యవస్థ అక్కడ లేదు. ఒకవేళ కస్టమర్ల నుంచి ఫిర్యాదు అందితే అమ్మకాలు జరుపకుండా సెల్లర్‌ను నిషేధిస్తారు. అయితేనేం! కొత్తపేరుతో వారు తిరిగి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సెల్లర్ రిజిస్ట్రేషన్ ఎటూ ఉచితమే’’ అని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సెల్లర్ ఒకరు వ్యాఖ్యానించారు. భారీ డిస్కౌంట్‌తో దొరుకుతున్నపుడు కస్టమర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారాయన.
నకిలీలు అరికట్టడం అసాధ్యం..!
ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ లక్షల ఉత్పత్తులు పోస్ట్ అవుతాయి. మొత్తంగా కోట్ల ఉత్పత్తులు కొలువుదీరతాయి. వీటన్నిటిపైనా పూర్తి స్థాయి పర్యవేక్షణ సాధ్యం కాదని ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ డైరెక్టర్ ఒకరు స్పష్టం చేశారు. ‘‘మీరొక షాపింగ్ మాల్‌కు వెళ్లారు. ఆ మాల్‌లోని ఓ షాపులో నకిలీ వస్తువు అమ్మారని అనుకుందాం. అపుడు తప్పు షాపు వారిదే తప్ప మాల్ నిర్వాహకులది ఎలా అవుతుంది? మా విషయంలోనూ అంతే. మేం మార్కెట్ ప్లేస్ విధానాన్ని అనుసరిస్తున్నాం. విక్రేతే బాధ్యుడు. నకిలీలకు చాలా మటుకు అడ్డుకట్ట వేస్తున్నా ఇలాంటి సంఘటనలు అపుడపుడు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఈ–కామర్స్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా విక్రేతలను చేర్చుకుని వ్యాపారం చేయడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి’’ అని ఆయన వివరించారు. అయితే మొబైల్స్ విక్రయంలో ఉన్న రిటైల్ చైన్ కంపెనీ ప్రతినిధి ఒకరు దీనిపై స్పందిస్తూ... ‘‘ఆన్‌లైన్ కస్టమర్లకు తాము కొనుగోలు చేసే వస్తువును విక్రయిస్తున్నది ఎవరో తెలియదు. వారికి తెలిసిందల్లా సదరు ఆన్‌లైన్ సంస్థ మాత్రమే. ఆ సంస్థపై భరోసాతోనే వస్తువులు కొనుగోలు చేయటానికి ముందుకొస్తారు. అలాంటిది ఉత్పత్తుల నాణ్యతకు తాము బాధ్యులం కాదని తప్పించుకుంటే ఎలా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఉత్పత్తుల నాణ్యత బాధ్యత వారిదేనని అన్నారు. కంపెనీలు ఇలాగే వాదిస్తే ఆఫ్‌లైన్‌లో కొనడమే బెటరని కస్టమర్లు భావిస్తారని చెప్పారాయన.
వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించొచ్చు
కస్టమర్ తనకు నచ్చిన ఉత్పాదనను ఈ–కామర్స్ కంపెనీ వెబ్‌సైట్లో చూశాకే బుక్ చేస్తారు. డబ్బులు చెల్లించేది కూడా ఈ కంపెనీకే. అంటే కస్టమర్, ఈ–కామర్స్ కంపెనీ మధ్యే కాంట్రాక్టుంటుంది. కంపెనీకి, విక్రేతకు మధ్య ప్రత్యేక ఒప్పందం ఉన్నా... సదరు ఉత్పాదనకు విక్రేతనే బాధ్యుడంటూ బాహాటంగా వెబ్‌సైట్లో, బిల్లు మీద ఈ–కామర్స్ కంపెనీలు స్పష్టం చేసినా... చట్టం నుంచి తప్పించుకోజాలరు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం నాణ్యమైన ఉత్పత్తులే విక్రయించాలి. ఉత్పాదన సహజ గుణాన్ని బట్టి నిర్దేశిత కాలం ఎలాంటి సమస్య లేకుండా పని చేయాలి. బాధితులు రెండేళ్లలో వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే సమస్య రాగానే కంపెనీతో కస్టమర్ సంప్రతింపులు జరపాలి. మొత్తంగా వస్తువు పాడైనా, నకిలీదిచ్చినా ఈ–కామర్స్ కంపెనీ, విక్రేత ఇద్దరూ బాధ్యత వహించాల్సిందేనని చట్టం చెబుతోంది.
– వేముల గౌరీశంకర రావు, న్యాయవాది, రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment