పెప్సికో బ్రాండ్ కుర్‌కురే (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : కుర్‌కురే అంటే ఎవరికి ఇష్టముండదో చెప్పండి.. భారతీయులకు కుర్‌కురే ఎంతో ఇష్టమైన బ్రాండ్. ఖాళీగా ఉన్నప్పుడు, ఆకలి వేసినప్పుడు, టైమ్ పాస్‌కు చాలా మంది కుర్‌కురే తింటూ ఉంటారు. కానీ గత కొంత కాలంగా కుర్‌కురేలో ప్లాస్టిక్ ఉందంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అయితే ఈ చర్చ విజృంభించింది. వీడియోల మీద వీడియోలు, పోస్టుల మీద పోస్టులు సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో తమ బ్రాండ్ కుర్‌కురేను దెబ్బతీస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై, ఆ బ్రాండ్ కంపెనీ పెప్సికో న్యాయపోరాటానికి దిగింది.
బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీసేలా.. నకిలీ, పరువు నష్టం కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సర్క్యూలేట్ చేస్తున్నాయని పెప్సికో, ఢిల్లీ హైకోర్టులో దావా దాఖలు చేసింది. దీంతో కుర్‌కురేకు వ్యతిరేకంగా ఉన్న వెబ్‌సైట్ లింక్‌లను, పోస్టులను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు సోషల్ మీడియాలను ఆదేశించింది. కుర్‌కురేకు వ్యతిరేకంగా పోస్టు అయిన వందల కొద్దీ పోస్టులను ఈ కంపెనీలు తొలగించాయి. యూట్యూబ్ కూడా ఇలాంటి వందల కొద్దీ వీడియోలకు స్వస్తి పలికింది. ఈ ఏడాది ప్రారంభంలో పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలపై సివిల్ దావా ఫైల్ చేసింది. 2018 జూన్ 1న సోషల్ మీడియా కంపెనీలకు కోర్టు ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది.
‘కుర్‌కురేలో ప్లాస్టిక్ ఉందంటూ వచ్చిన నకిలీ వార్తలతో, తమ బ్రాండ్ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపింది. సోషల్ మీడియాలో సర్య్యూలేట్ అయిన పరువు నష్టం కంటెంట్, నకిలీ వార్తల వల్లే, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాం’ అని పెప్సికో అధికార ప్రతినిధి చెప్పారు. ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లతో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని, నకిలీ, పరువు నష్టం కలిగించే అంశాలపై తాము కౌంటర్ దాఖలు చేస్తున్నామని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కుర్‌కురేకు ఎవరూ వ్యతిరేకంగా కామెడీ, విమర్శనాత్మక పోస్టులు పెట్టినా.. వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా పెప్సికో రంగం సిద్ధం చేసింది. అయితే ఇలాంటి విషయాలపై న్యాయ అథారిటీలు జోక్యం చేసుకోవాలని పెప్సికో కోరడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పెప్సికో ‘లేస్ చిప్స్’ కు వ్యతికేంగా వచ్చిన ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వీడియోలు, వెబ్‌లింక్‌లను బ్లాక్ చేయాలని కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లేచిప్స్ తినడం వల్ల ఓ వ్యక్తి మరణించినట్టు గత ఫిబ్రవరి 26న మింట్ రిపోర్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment