విశ్రాంతం.. ప్రశాంతంగా!
ఎప్పుడూ కష్టపడటమే. చిన్నప్పుడు చదువుకోసం... ఆ తరవాత కెరీర్ కోసం... కెరీర్‌లో స్థిరపడ్డాక కుటుంబం కోసం... ఆ తరవాత పిల్లల కోసం... ఇక విశ్రాంతెక్కడ? రిటైర్మెంట్ అన్నది అందుకే కావచ్చు. అయితే నిజంగానే విశ్రాంత జీవితం హాయిగా ఉంటోందా...? చాలామంది వృద్ధుల విషయంలో లేదనే సమాధానమే వస్తోంది. కష్టపడి పిల్లల్ని మంచి హోదాలకు తీసుకొచ్చిన తల్లిదండ్రులు కూడా విశ్రాంత జీవితంలో సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే పిల్లలు చదువనో, కొలువనో విదేశాల్లో కొందరు, ఇతర రాష్ట్రాల్లో కొందరు తల్లిదండ్రులకు దూరంగానే ఉండాల్సి వస్తోంది. అందుకే... పిల్లలు దగ్గర లేకున్నా తమ లాంటి వారి మధ్య, సకల సౌకర్యాలతో ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వారికోసం నిర్మాణ సంస్థలు ‘రిటైర్మెంట్ హోమ్స్’కు బీజం వేశాయి. లగ్జరీతో పాటు ఆరోగ్యం, ఆనందం, శాంతిభద్రతలు, ప్రేమానురాగాలు కలిసిన ఈ రిటైర్మెంట్ హోమ్స్ ఏఏ నగరాల్లో బాగా విస్తరిస్తున్నాయి? వీటిని ఎప్పుడు కొంటే మంచిది? కొనలేని పక్షంలో అద్దెకుండే అవకాశముందా? అసలు ఈ గృహాల బిజినెస్ ఎంత? వీటిని ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా కూడా వాడుకుంటున్నారా? లాభం ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలియజేసేదే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం...
- హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
- రిటైర్మెంట్ హోమ్స్.. పెద్దల కోసం ప్రత్యేక గృహాలు
- ఫ్లాట్ విస్తీర్ణం నుంచి వసతుల వరకూ అన్నీ ప్రత్యేకమే
- 25 బిలియన్ డాలర్లకు పరిశ్రమ
- 10 ఏళ్ల ముందు కొంటే చాలు
రిటైర్మెంట్ హోమ్స్ గురించి విన్నవారెవరైనా... వృద్ధాశ్రమాల్లాంటివేగా...!! అని అనుకోవచ్చు. కానీ ఈ రెండింటికీ ప్రధానమైన తేడా ఏంటంటే ఈ రిటైర్మెంట్ హోమ్స్‌లో ఫ్లాట్ కొన్నవారో లేకపోతే అద్దెకు తీసుకున్నవారో మాత్రమే ఉంటారు. నిర్వహణ రుసుం చెల్లించి అన్ని సౌకర్యాలూ పొందవచ్చు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే అపార్ట్‌మెంట్‌లోనే ప్రాథమిక చికిత్సా కేంద్రం ఉంటుంది. 24 గంటలు అంబులెన్స్, రెసిడెంట్ నర్సు, వైద్యుడు అందుబాటులో ఉంటారు. అనారోగ్యం తలెత్తితే క్షణాల్లో దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళతారు.
వారానికోసారి డాక్టరొచ్చి అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు కూడా. నడక కోసం గ్రీన్ స్పేస్‌తో పాటు హాబీ సెంటర్, కమ్యూనిటీ కిచెన్, సిమ్మింగ్ పూల్, యోగా కేంద్రాలు, ఏటీఎం, సూపర్ మార్కెట్, గ్రంథాలయం వంటి సౌకర్యాలన్నీ రిటైర్మెంట్ హోమ్స్‌లో ఉంటున్నాయి. వీటిలో ఉండే వారు ఏ అవసరానికీ బయటికి వెళ్లాల్సిన పనిలేదు. నివాసితులు బృందాలుగా ఏర్పడి సంఘసేవ, గార్డెనింగ్ చేయొచ్చు. అపార్ట్‌మెంట్ వాహనంలో పుణ్యక్షేత్రాలు, విహార యాత్రలకు కూడా వెళ్లొచ్చు. ఇక వినోదానికి ఇండోర్ థియేటర్, ఓపెన్ థియేటర్‌లు సైతం వీటిలోనే ఉంటాయి.
క్రమం తప్పని మెను..
రిటైర్మెంట్ హోమ్స్‌లో వృద్ధులు వంట చేసుకోనక్కర్లేదు. ఉదయం 5 గంటల కల్లా టీతో మొదలుపెట్టి... టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, బిస్కెట్లు, రాత్రి భోజనం ఇలా అన్నీ సరైన వేళల్లో అందిస్తారు. మెస్‌కు వచ్చి భోజనం చేయలేని వారికి ఫ్లాట్‌కే పంపిస్తారు. కావాల్సిన వారికి ఇంట్లోనే పైపులైన్లో గ్యాస్ అందుబాటులో ఉంటుంది. కరెంటు పొదుపు, వ్యర్థాలను మళ్లీ వాడటం, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా నీటిని శుద్ధి చేయడం వంటివి మామూలే. ఇంట్లో పనులకు, బట్టలు ఉతకడానికి ప్రత్యేకించి పనిమనిషులుంటారు. 24 గంటలూ సీసీ కెమెరాల నీడలో కట్టుదిట్టమైన భద్రతా ఉంటుంది.
నిర్మాణంలోనే ప్రత్యేక ఏర్పాట్లు...
నిర్మాణ సమయంలోనే ఈ ఫ్లాట్లను వృద్ధులకు తగ్గట్టుగాతీర్చిదిద్దుతారు. ఇవి ఐదు అంతస్తుల్ని మించవు. వెడల్పాటి తలుపులు, పెద్ద బాత్రూమ్‌లు, వీల్‌చైర్స్ వెళ్లేలా మెట్లు, విశాలమైన లిఫ్ట్‌లుంటాయి. మోకాళ్ల నొప్పులున్న వారికి ఫ్లాట్స్‌లో ప్రత్యేకమైన టాయ్‌లెట్స్ ఉంటాయి. బాత్రూమ్, బెడ్‌రూమ్, కారిడార్లలో గ్రాబ్ బార్స్‌తో పాటు అత్యవసర సమయాల్లో వినియోగించే ప్యానిక్ బజర్లూ ఉంటాయి. గ్రాబ్ బార్స్‌తో వృద్ధులు సులువుగా నడవటం, కూర్చోవటం చేయొచ్చు. ప్రాజెక్ట్ అంతా యాంటీ స్కిడ్ ఫ్లోరింగే ఉంటుంది. ఒకవేళ కిందపడితే ఎక్కడికక్కడ ఉండే ప్యానిక్ బటన్‌ను నొక్కితే చాలు. సెక్యూరిటీ దగ్గర అలారం మోగి... వారు అప్రమత్తమై ఫ్లాట్‌కు చేరుకుంటారు.
పదేళ్ల ముందు కొంటే మంచిది...!
రిటైరవటానికి 5-10 ఏళ్ల ముందు ఈ హోమ్స్‌ను కొంటే చాలనేది నిపుణుల సూచన. ఎందుకంటే వివిధ కారణాల వల్ల రియల్టీ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. అలాకాక 60 ఏళ్లు దాటాక కొనుగోలు చేస్తే గృహ రుణం పొందటం కష్టం. పొందినా ఈఎంఐల భారం ఎక్కువ. అధిక ఫ్లాట్ విస్తీర్ణాలతో పాటు ప్రత్యేక వసతులుంటాయి కనక సాధారణ ఫ్లాట్లతో పోలిస్తే రిటైర్మెంట్ హోమ్స్ ధర 10-15 శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఏ వయసువారైనా కొనొచ్చు. కానీ వాటిలో ఉండాలంటే మాత్రం 55 ఏళ్లు దాటాల్సిందే. ఒకవేళ భవిష్యత్ కోసం చిన్న వయసు వారు కొంటే... దాన్ని 55 ఏళ్లు దాటినవారికి అద్దెకో, లీజుకో ఇవ్వొచ్చు. ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సీనియర్ సిటిజన్స్‌కే అమ్మాలి.
దీన్ని మరిచిపోవద్దు సుమా!
రిటైర్మెంట్ హోమ్స్‌లోని ప్రత్యేక వసతుల నిమిత్తం ముందుగా ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు. ప్రాజెక్టు పూర్తయితే బిల్డరే నిర్వహణకు ముందుకొస్తారు. ఒకవేళ రాకున్నా... ఫ్లాట్ ఓనర్ల అసోసియేషన్ ఈ నిర్వహణను చేపడుతుంది. అయితే ఇక్కడొకటి గుర్తుంచుకోవాలి. సాధారణ ప్రాజెక్ట్‌లతో పోలిస్తే రిటైర్మెంట్ హోమ్స్‌ను విక్రయించడం కాస్తకష్టమే. ఎందుకంటే వీటి నిర్వహణ వ్యయం ఎక్కువ. పెపైచ్చు నిర్వహణ సరిగ్గా లేకుంటే ధర కూడా పడిపోతుంటుంది. సాధారణ నివాస ప్రాజెక్ట్‌లతో పోలిస్తే వీటి నిర్వహణ చార్జీలు 40-50 శాతం ఎక్కువ. దాదాపు నెలకు చదరపు అడుక్కి రూ.8-10 వరకూ వసూలు చేస్తుంటారు.
మెట్రోల్లో పెరుగుతున్న నిర్మాణాలు...
రిటైర్మెంట్ హోమ్స్‌ను నగరానికి పరిచయం చేసింది కాప్రా కేంద్రంగా పనిచేస్తున్న సాకేత్ గ్రూప్ అనే చెప్పాలి. ఈసీఐఎల్ సమీపంలోని 5 ఎకరాల్లో ప్రణామ్ పేరుతో ఐదేళ్ల కిందటే రిటైర్మెంట్ హోమ్‌ను నిర్మించిందీ సంస్థ. మూడు బ్లాకుల్లో 550-2000 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 375 ఫ్లాట్లున్నాయి. ‘‘వృద్ధుల గృహాలకున్న డిమాండ్ రీత్యా ప్రతికూల పరిస్థితుల్లోనూ విక్రయించగలిగాం. ప్రణామ్ అంటే నమస్కారం. అందుకే దీనికి ఆ పేరు పెట్టాం. గౌడవెల్లిలో నిర్మిస్తున్న ‘భూఃసత్వ’లోనూ ఐదెకరాల్లో ప్రణామ్ పేరిట రిటైర్మెంట్ హోమ్స్‌ను నిర్మిస్తున్నాం’’ అని సాకేత్ గ్రూప్ డెరైక్టర్ రవికుమార్ చెప్పారు. ప్రగతి రిసార్ట్‌లో 11 ఎకరాల్లో ‘సెరెన్ ప్రగతి’ పేరుతో రిటైర్మెంట్ హోమ్స్‌ను నిర్మిస్తోంది మరో సంస్థ. ఇందులో మొత్తం ఫ్లాట్లు 112. విస్తీర్ణాన్ని బట్టి రూ.28- 90 లక్షల వరకు ధర ఉంది.
ఇతర నగరాల్లోనూ జోరు...
రిటైర్మెంట్ హోమ్స్‌కున్న డిమాండ్‌ను చూసి బడా సంస్థలు ఈ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టాయి. పరంజపే స్కీమ్స్ కన్‌స్ట్రక్షన్స్, ఆషియానా హౌసింగ్, అదానీ రియల్టీ, టాటా హౌసింగ్, సిల్వర్ గ్రేడ్స్, బ్రిగేడ్, మ్యాక్స్‌లు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, పూణె నగరాల్లో రిటైర్మెంట్ హోమ్స్ నిర్మిస్తున్నాయి.
- ఆషియానా హౌసింగ్ పుణే, ఢిల్లీ ఎన్‌సీఆర్, జైపూర్, చెన్నైల్లో పెద్దల గృహాలను నిర్మిస్తోంది.
- {బిగేడ్ గ్రూప్ బెంగళూరులో 130 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బ్రిగేడ్ ఆర్చిడ్స్ టౌన్‌షిప్‌లో కొంత భాగంలో పార్క్‌సైడ్ పేరుతో రిటైర్మెంట్ హోమ్స్‌ను నిర్మిస్తోంది.
- మ్యాక్స ఎంటర్‌ప్రైజ్ డెహ్రాడూన్‌లో అంటారా పేరుతో ప్రీమియం సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 1,400 నుంచి 10,000 చ.అ.ల్లో ఫ్లాట్ విస్తీర్ణాలున్నాయి. ప్రారంభ ధర రూ.1.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు పైగానే పలుకుతున్నాయి.
- దేశంలో నిర్మించే 13 రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్ట్‌లో రానున్న ఐదేళ్లలో టాటా హౌసింగ్ సంస్థ రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రివా రెసిడెన్సెస్ పేరుతో బెంగళూరులో తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందీ సంస్థ. అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, చెన్నై, ఎన్‌సీఆర్, పుణేల్లో త్వరలోనే ప్రారంభించనుంది.
25 బిలియన్ డాలర్ల పరిశ్రమ..!
ప్రాపర్టీ కన్సల్టెన్సీ జోన్స్‌లాంగ్ లాసెల్లె అంచనా ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా రిటైర్మెంట్ హోమ్స్ మార్కెట్ విలువ ఏకంగా 25 బిలియన్ డాలర్లు. అమెరికాలోని సీనియర్ సిటిజన్స్‌లో 12 శాతం మంది వీటిలోనే ఉంటున్నారు. ఆస్ట్రేలియాలో వీరి వాటా 4 శాతం. 100 కోట్ల జనాభా దాటిన మన దేశంలో 3 లక్షల రిటైర్మెంట్ హోమ్స్ అవసరమవుతాయని, వీటి విలువ బిలియన్ డాలర్ల పైనేనన్నది విశ్లేషకుల అంచనా. మనదేశంలో 60 ఏళ్లకు పైబడిన వారి జనాభా దాదాపు 10 కోట్లు. ఏటా 3.8 శాతం పెరుగుతోంది. దీంతో 2050 నాటికి 24 కోట్లకు చేరుతుందని అంచనా. భవిష్యత్తులో దేశంలో రిటైర్మెంట్ హోమ్స్‌కు ఉండబోయే డిమాండ్‌కు ఈ అంకెలే నిదర్శనం.
వృద్ధాప్యంలో మళ్లీ పుడతారు..
ఆర్థిక సమస్యల వల్లే పేద కుటుంబాల్లో తల్లిదండ్రులను భారంగా చూస్తారని అనుకునేవాణ్ణి. కానీ కోట్ల రూపాయల ఆస్తులున్నా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఆశ్రమాల్లో వృద్ధుల ఆలనపాలన అంతగా పట్టించుకోరు. అందుకేరిటైర్మెంట్ హోమ్స్ బెస్ట్. నాకు తుమ్మకుంటలో ఫాం హౌస్ ఉంది. అక్కడే ఉంటా. 15 రోజులకొకసారి వచ్చి కాసేపు గడిపివెళ్తా. ఉన్న కాసేపైనా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడుండేది ఒకే వయసు వారు కనక అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటాం. మంచి స్నేహితులు లభించారన్న తృప్తి ఉంటుంది.
- రామన్ పటేల్, సాకేత్ ప్రణామ్ నివాసి
వృద్ధులకు ఇలాంటి గృహాలు అవసరం.
మా వారి ఉద్యోగరీత్యా చాలా చోట్ల ఉన్నాం. ఇక్కడకు వచ్చాక ఎక్కడుండాలో తెలియలేదు. అప్పట్లో ‘సాక్షి’ దినపత్రికలో ప్రణామ్ గృహాల గురించి చదివాం. 2011 ఫిబ్రవరి 22న ప్రణామ్‌లో తొలి ఫ్లాట్‌ను మేమే తీసుకున్నాం. మాకు ఇద్దరమ్మాయిలు. ఒకరు జర్మనీ, మరొకరు అమెరికాలో స్థిరపడ్డారు. రోజూ ఇంటర్‌నెట్లో మాట్లాడతాం. గతేడాది పిల్లలు ఇక్కడికి వ చ్చారు. ఇక్కడి సదుపాయాలు చూసి చాలా సంతోషించారు. వృద్ధులకు ఇలాంటి గృహాలు చాలా అవసరం.
- అన్నపూర్ణారావు, సాకేత్ ప్రణామ్ నివాసి