చలో ఫారిన్ టూర్! | special story about Foreign Tour | Sakshi
Sakshi News home page

చలో ఫారిన్ టూర్!

Published Wed, May 11 2016 5:34 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

చలో ఫారిన్ టూర్! - Sakshi

చలో ఫారిన్ టూర్!

అన్ని వర్గాల్లోనూ పెరుగుతున్న భారతీయ టూరిస్టులు
కొందరికి ఖర్చు లెక్కలేదు; పొదుపుతో మరికొందరు
ఏటా 1.8 కోట్ల మంది టూరిజానికి; 2020 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా పెళ్లైన జంట. హనీమూన్‌కు భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లారు. సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి నగరాలతో పాటు క్వీన్స్‌లాండ్‌లోని గ్రేట్ బారియర్ రీఫ్ వంటివన్నీ చుట్టేశారు. ఇంతకీ ఆ టూర్‌కు సదరు జంట ఖర్చుపెట్టిందెంతో తెలుసా? అక్షరాలా యాభై లక్షలు. మరో జంటను తీసుకుంటే... వారి ఆదాయం తక్కువ. కానీ వారూ కేరళలోని మున్నార్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లొచ్చారు. పొదుపుగా... రైల్లో వెళ్లి అక్కడ చక్కగా వారం రోజులుండి వచ్చారు. ఖర్చు రూ.50వేలు మించలేదు.

 ఈ రెండు ఉదాహరణలూ చూశాక అనిపించేదొక్కటే. భారతీయులు పర్యటనలకు ఎంతైనా ఖర్చు పెడుతున్నారని మొదటి సంఘటన చెబితే... పర్యటనలకు వెళ్లే ఆర్థిక స్థోమత నిజంగా లేనప్పటికీ కొంచెం కొంచెం పొదుపు చేసుకుని కూడా వెళుతున్నారని తెలుస్తుంది. మొత్తమ్మీద ఈ రెండు సంఘటనలూ చెప్పేదొక్కటే. దేశంలో ఇపుడు పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. ఒకప్పుడు విదేశాలకు విహార యాత్రలంటే నెలల ముందు నుంచి ప్రణాళిక వేసుకోవాల్సి వచ్చేది.

దీంతో వెళ్లేవారు కూడా తక్కువే ఉండేవారు. ఇపుడంతా ఇన్‌స్టంట్. ఏదైనా కంపెనీ ఆఫర్ ఇచ్చినా, లేదా ప్రసార మాధ్యమాల్లో ఆకట్టుకునే ప్రకటన చూసినా వెంటనే క్రెడిట్ కార్డు స్వైప్ చేయటమో, బ్యాంకుల్ని సంప్రదించటమో చేస్తున్నారు. బ్యాంకులు కూడా ముందు పర్యటనకు వెళ్లి వచ్చేసి... ఆ తరువాత సదరు మొత్తాన్ని తీరిగ్గా ఈఎంఐలలో కట్టే ఆఫర్లు అందిస్తున్నాయి. ఎంబసీ స్థాయిలో వీసా ప్రక్రియ గనక మరింత సరళతరమైతే విదేశీ టూర్లు ఇంకా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

 సేద తీరాల్సిందే...!
విదేశీ టూర్లు ఒకప్పుడు సంపన్నులకే పరిమితమయ్యేవి. ఇప్పుడు మధ్యతరగతి వారూ ఆసక్తి కనబరుస్తున్నారు. ‘‘ఆదాయాలు పెరగటంతో పాటు టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటు ధరల్లోకి వచ్చాయి. కంపెనీలు సైతం అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీలు తయారు చేస్తున్నాయి. అందుకే విదేశీ ప్రయాణాలు పెరుగుతున్నాయి’’ అని ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జతిందర్ పాల్ సింగ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. వివిధ దేశాల్లోని దర్శనీయ ప్రాంతాలను సినిమాల్లో, ఇంటర్నెట్‌లో చూసి ఇట్టే ఆకర్షితులవుతున్నారని, ఒత్తిడి నుంచి కాసింత ఉపశమనం కోసం విహార యాత్రలు, సాహస యాత్రలు, షాపింగ్‌కు దేశాలను దాటుతున్నారని ఆయన చెప్పారు.

 మరో కొత్త పోకడను చూస్తే... గతంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు వెళ్లి... అక్కడ బాగా ప్రాచుర్యం ఉన్న ప్రాంతాలనే చూసేవారు. ఇప్పుడైతే ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాలనూ చుట్టేసి వస్తున్నారు. అపార్ట్‌మెంట్, విల్లా, ఫామ్ హౌజ్ అద్దెకు తీసుకోవడం, గ్రామంలో బస చేయడం వంటివి పెరుగుతున్నాయి. సముద్ర ప్రయాణం చేస్తూ క్రూయిజర్‌లో సేద తీరటమూ ఈ మధ్య పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి.

 భారతీయుల కోసం..
భారత్ నుంచి విదేశాలకు వెళుతున్న వారిలో అత్యధికులు స్విట్జర్లాండ్, సింగపూర్, థాయ్‌లాండ్, లండన్, యూఎస్‌లనే ఎంచుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఐదే టాప్-5 డెస్టినేషన్స్‌గా నిలుస్తున్నాయి కూడా. ఇక దుబాయి, సీషెల్స్, తూర్పు యూరప్, స్కాండినేవియా, వియత్నాం, కంబోడియా, చైనా, బాలి, మెక్సికో, కెనడా తదితర ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే టూర్లు పెరుగుతున్నాయి. భారతీయులను ఆకట్టుకోవడానికి దుబాయిలో ప్రపంచంలోనే తొలి బాలీవుడ్ థీమ్ పార్క్ ఏర్పాటవుతోంది. అక్టోబరులో ఇది ప్రారంభం కానుంది.

విహార యాత్రల కోసం భారత్ నుంచి ఏటా 1.8 కోట్ల మంది విదేశాలకు వెళ్తుండగా... 2020 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి. వ్యవస్థీకృత సంస్థల ద్వారా 25 శాతం మంది టూర్లను ఎంచుకుంటుండగా మిగిలిన వారు స్థానిక ఆపరేటర్లను సంప్రదించటం, కొందరు ఇంటర్నెట్ సాయంతో సొంతగా టూర్లను ఎంచుకోవటం వంటివి చేస్తున్నారు. కొందరు విమాన టిక్కెట్లు తీసుకుని... తాము చేరాలనుకున్న దేశం చేరాక... అక్కడే స్థానిక టూర్ ఆపరేటర్‌ను ఎంచుకుంటున్నారు.

కస్టమర్ల సంఖ్య పరంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లు టాప్ సిటీస్‌గా నిలుస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఈ-వీసా, వీసా ఆన్ అరైవల్ వంటివి యాత్రికులు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. కాకపోతే వీసా చార్జీలు మరింత తగ్గాల్సి ఉంది. కొన్ని దేశాల వీసాల కోసం ఎంబసీల చుట్టూ తిరిగే ఓపిక లేక చాలా మంది ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఎంబసీ స్థాయిలో వీసా ప్రక్రియ మరింత సరళతరమైతే విదేశాలకు వెళ్లే వారి సంఖ్య అధికమవుతుంది’’ అని ఓ ట్రావెల్ కంపెనీ అధిపతి అభిప్రాయపడ్డారు.

వాయిదాల్లో చలో..
దేశంలోని టూర్ కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్న థామస్ కుక్ ద్వారా ఏటా లక్ష మంది విహార యాత్రలకు విదేశాలు చుట్టివస్తున్నట్లు జతిందర్ పాల్ సింగ్ చెప్పారు. ‘‘మేం నాలుగు కేటగిరీల్లో ప్యాకేజీలందిస్తున్నాం. అల్ట్రా లగ్జరీ విభాగంలో 3 శాతం మంది, ప్రీమియం 25 శాతం, వాల్యూ 35 శాతం, మిగిలినవారు బడ్జెట్ విభాగంలో వెళుతున్నారు’’ అని ఆయన చెప్పారు. ప్యాకేజీనిబట్టి ఒక జంటకు యూరప్ ట్రిప్‌కు వరుసగా రూ.4 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.79 వేలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. తాము వాయిదాల్లోనూ ప్యాకేజీలు అందిస్తున్నామని, దీనికి బాగా డిమాండ్ ఉందని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement