పోతే పోనీ అనుకుంటే...ఆదాయం అదుర్స్‌! | special story on Stock market | Sakshi
Sakshi News home page

పోతే పోనీ అనుకుంటే...ఆదాయం అదుర్స్‌!

Published Sun, Jul 23 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

పోతే పోనీ అనుకుంటే...ఆదాయం అదుర్స్‌!

పోతే పోనీ అనుకుంటే...ఆదాయం అదుర్స్‌!

రిస్క్‌తో పాటు భారీ రాబడినిచ్చేవి ఈక్విటీలొక్కటే కాదు
మెరుగైన రాబడులకు మరిన్ని ప్రత్యామ్నాయాలున్నాయ్‌
బిట్‌ కాయిన్, విలువైన రాళ్లు, పీటుపీ వ్యాపారం ఇలాంటివే
వీటిపై అవగాహన పెంచుకున్నాకే పెట్టుబడి పెట్టడం బెటర్‌
లేకపోతే పెట్టుబడి పెట్టిన అసలుకూ ఎసరే  


చాలామంది అంటుంటారు... షేర్‌ మార్కెట్‌ అంటే రిస్క్‌ ఎక్కువని. నిజమే!! కొన్ని చిన్న, మధ్య తరహా షేర్లలో పెట్టుబడి పెడితే నెల రోజులకే మన సొమ్ము రెట్టింపయిపోవచ్చు. పది రోజులు తిరక్కుండానే జీరో కూడా అయిపోవచ్చు. దీనర్థం ఒక్కటే!! రిస్క్‌ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో... అక్కడ రివార్డ్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంటే రాబడి అన్నమాట.

మరి ఇలా రిస్క్‌ తీసుకుంటే భారీ రివార్డ్‌నిచ్చేది స్టాక్‌ మార్కెట్‌ ఒక్కటేనా? షేర్లు ఒక్కటేనా? ఇంకేవీ ఈ స్థాయిలో లేవా? ఈ ప్రశ్నకు ఉన్నాయనే సమాధానమే వస్తుంది. మరి ఆ ప్రత్యామ్నాయా పెట్టుబడి సాధనాలేంటి? వాటిలో ఉండే రిస్క్‌లేంటి? ఇవన్నీ తెలియజెప్పేదే ఈ కథనం.

వడ్డీ వ్యాపారం... పీటుపీ
అప్పులిచ్చే వ్యాపారం నిజానికి బ్యాంకులు... ఆర్థిక సంస్థలది. కాకపోతే కొందరు వ్యక్తులు కూడా ఇపుడు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. డబ్బులు అవసరమైనవారికి వారు అప్పులిస్తారన్న మాట. ఈ ఇద్దరినీ కలపటానికి ఇపుడు ఆన్‌లైన్‌ వేదికగా ‘ఐలెండ్‌’ వంటి మార్కెట్‌ లీడర్లతో పాటు పలు సంస్థలున్నాయి. దీన్నే పీర్‌ టు పీర్‌ (పీటుపీ) అంటుంటారు. ఉదాహరణకు... వరుణ్‌ (38) అనే ప్రైవేటు ఉద్యోగి ఇదే విధమైన వ్యాపారాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.20వేల రుణాన్ని ఇస్తుంటాడు. ఇలా 100 మందికి రుణాలిచ్చి సగటున 28 – 30 శాతం రాబడులను అందుకుంటున్నాడు.

ఈ విధమైన వ్యాపారంలో ఎగవేతల ప్రమాదం కూడా ఉంటుంది. వరుణ్‌ దగ్గర అప్పు తీసుకున్న వారిలో ఇద్దరు ఏడాదిగా చెల్లించడం మానేశారు. ఇదే ఈ వ్యాపారంలో రిస్క్‌. ఈ రంగంలో ఎగవేతలు 4 శాతం వరకూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాపారం అన్న తర్వాత రిస్క్‌ ఎలానూ ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలతో వాటిని ఎదుర్కోవటం కష్టం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఉదాహరణకు కొత్తగా పీటుపీ వ్యాపారంలో అడుగు పెట్టేవారు... ఒక్కరికే ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వకూడదు

. ఉదాహరణకు రూ.లక్ష పెట్టుబడితో రంగంలోకి దిగితే ఒక్కరికి రూ.5 వేలకు మించి రుణం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. రుణ గ్రహీతల మనస్తత్వం, వారి చెల్లింపుల తీరుపై అవగాహన తర్వాత తదుపరి అడుగులు వేయాలన్నది ఈ రంగంలోని నిపుణుల సూచన. ఉదాహరణకు కొందరు పీటుపీ వ్యాపారులు పెళ్లి కాని బ్రహ్మచారులకు రుణాలు ఇవ్వరు. పెళ్లయి, పిల్లలు ఉన్నవారికే వారి ప్రాధాన్యం. ఎందుకంటే వీరు బాధ్యతగా ఉంటారని.

క్రిప్టో కరెన్సీ...: బిట్‌ కాయిన్‌
రిస్క్‌తో పాటు రివార్డు కూడా భారీగా ఉన్న పెట్టుబడి సాధనాల్లో బిట్‌ కాయిన్‌ ఒకటి. యువ, కొత్త ఇన్వెస్టర్లను ఇప్పుడు బాగా ఆకర్షిస్తోంది. డిజిటల్‌ రూపంలో మాత్రమే కనిపించే ఈ అనధికార కరెన్సీ (ఆర్‌బీఐ ఆమోదం లేదు) ధర ఏడాది కిందట ఒకో బిట్‌కాయిన్‌కు 579 డాలర్లు. ప్రస్తు తం ఇది 2,600 డాలర్ల స్థాయిలో ఉంది. ఇటీవలే 3,100 డాలర్ల స్థాయికి కూడా వెళ్లొచ్చింది. అంటే ఏడాదిలో దీని రాబడులు 4 నుంచి 5 రెట్ల వరకు ఉన్నాయన్న మాట. ఒక బిట్‌కాయిన్‌లో మిల్లీ వంతును కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు దీనివైపు చూస్తున్నారు.

అంతర్జాతీయంగా బదిలీ చేసుకోతగ్గ ఈ ఆన్‌లైన్‌ కరెన్సీకి ప్రపంచంలో ఏ ప్రభుత్వ ఆమోదమూ లేదు. కానీ పలు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌తో సహా అమెజాన్‌ వంటి సంస్థలు కూడా ఈ కరెన్సీలో చెల్లింపుల్ని అంగీకరిస్తున్నాయి. మరో వంక ఈ కరెన్సీపై ఏ ప్రభుత్వానికీ నియంత్రణ కూడా లేదు. నిజానికి ఇది సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం కానే కాదు. కాకపోతే దీన్ని ఆమోదించే ప్రైవేటు సంస్థల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దీని విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టేవారు కూడా స్వల్ప కాలంలో లాభాలను తీసుకునే ధోరణితోనే ఉంటున్నారు. ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకుంటే వీటిలో రిస్క్‌ ఎక్కువేనని తెలుసు. ఎందుకంటే ఇటీవలే ఇది 3,100 డాలర్ల స్థాయిని తాకింది.

 మరి అప్పుడు కొన్నవారి పరిస్థితేంటి? స్వల్పకాలంలోనే 15 శాతం నష్టపోయినట్లు లెక్క. అయితే అధిక రాబడుల కోసం వీటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఒకవేళ బాగా రిస్క్‌ తీసుకోవటానికి సిద్ధపడ్డవారైతే తమ దగ్గరున్న నిధుల్లో కేవలం 2 నుంచి 3 శాతం లోపే ఈ తరహా సాధనాలకు కేటాయించడం కొంతలో కొంత సురక్షితం. ఎందుకుంటే భారీ ప్రతిఫలాన్ని ఇవ్వడంలో ముందుండే ఇవి... అదే సమయంలో కుడి ఎడమైతే జీరో అయిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. వీటిలో ఆటుపోట్లు ఎక్కువ.

విలువైన రాళ్లు... నకిలీలుంటాయ్‌!!
వజ్రాలు, ఇతర విలువైన రాళ్లపై పెట్టుబడులు కూడా మంచి రాబడులను ఇవ్వగలవు. వీటిలో రాబడులు ఒక నెలలో 10 నుంచి 15 శాతం వరకూ ఉండొచ్చు. ఒక్కో సారి నెల పాటు, ఏడాది పాటు కూడా ధరలు స్థిరంగా ఉండేందుకూ అవకాశం లేకపోలేదు. ఈ వ్యాపారం ఎక్కువ శాతం అవ్యవస్థీకృతం. అయినప్పటికీ పారదర్శకత ఎక్కువే. ఎప్పటికప్పుడు రేట్లను ఆన్‌లైన్లో చూసుకోవచ్చు. తద్వారా మార్కెట్‌ ధరపై ఒక అంచనాకు రావచ్చు. డివైన్‌ సొలిటైర్స్‌ తదితర కొన్ని కంపెనీలు ప్రతి నెలా వజ్రాల ధరలను ప్రకటిస్తున్నాయి. ఎవరైనా కొనుగోలుదారుడు తిరిగి విక్రయించాలనుకుంటే వారికి మార్కెట్‌ ధరలో కనీసం 90 శాతం చెల్లిస్తామన్న హామీనిచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. ఆభరణాల విక్రేత ఈ మేరకు ధర ఇచ్చేందుకు నిరాకరిస్తే నేరుగా కంపెనీనే సంప్రదించొచ్చు.

పెట్టుబడుల కోసం వజ్రాల బాట పడితే అధిక నాణ్యత గలవి కాకుండా మోస్తరు నాణ్యత ఉన్న వాటిని, అందులోనూ 0.3 క్యారట్ల నుంచి 0.8 క్యారట్ల మధ్యలో ఉన్నవి ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో రాబడులు ఎక్కువగా ఉంటాయంటున్నారు. నకిలీల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నది వీరి సూచన. రంగు, క్లారిటీ, కట్, క్యారట్‌ ఇవన్నీ ఓ వజ్రం ధరలో కీలక పాత్ర పోషిస్తాయి. పెట్టుబడుల కోసం వజ్రాలు కొనే వారు కొంచెం ఫీజు చెల్లించయినా సరే తప్పకుండా సీరియల్‌ నంబర్‌తో ఉన్న సర్టిఫికెట్‌ తీసుకోవాలి.

క్రౌడ్‌ ఫండింగ్‌... హీరో–జీరో
ఏదైనా ఓ కొత్త వ్యాపారం లేదా స్టార్టప్‌ సంస్థలో పెట్టుబడి పెట్టడమే క్రౌడ్‌ ఫండింగ్‌. ఉదాహరణకు ఓ వ్యక్తి అద్భుతమైన ఉత్పత్తిని తయారు చేశాడు. దాన్ని మార్కెట్లోకి తేవటానికి తన దగ్గర డబ్బుల్లేవు. వాటికోసం క్రౌడ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్లపై ఆధారపడ్డారు. అంటే ఆయా సైట్లలో తన ఉత్పత్తిని వివరిస్తూ... పెట్టుబడి కావాలని అభ్యర్థించాడు. అలా పెట్టుబడి పెట్టినవారికి తన కంపెనీలో వాటా ఇస్తాడన్న మాట. ఒకవేళ ఆ ఉత్పత్తి గనక మార్కెట్లోకి వచ్చి విజయవంతమైతే... తన వ్యాపారానికి తిరుగుండదు. ఈ క్రౌడ్‌ ఫండింగ్‌ చేసినవారి వాటా విలువ కూడా భారీగా పెరుగుతుంది.

అయితే క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు స్వీకరించే సంస్థల్లో నకిలీవి కూడా ఉంటాయి. నిధులందుకుని బోర్డు తిప్పేసే అవకాశమూ ఉంటుంది. నిజానికి క్రౌడ్‌ ఫండింగ్‌ చేసినవారికి కంపెనీ నిర్ణయాల్లో ఎటువంటి పాత్రా ఉండదు. ఇలా నిధులు సమీకరించే వాటిలో ఎక్కడో ఒకటి రెండు మాత్ర మే దీర్ఘకాలానికి నిలదొక్కుకుని లాభాలను అందించే అవకాశం ఉంటుంది. స్టార్టప్‌ విఫలమైనా, ఉత్పత్తి ఆదరణకు నోచుకోకపోయినా పెట్టుబడి పెట్టిన వారికి అసలు కూడా తిరిగి రాదు. అందుకే పెట్టుబడికి ముందే నేరుగా సంబంధిత స్టార్టప్‌ లేదా ఉత్పత్తికి సంబంధించి యజమానులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోవాలన్నది ఈ రంగంలోని నిపుణుల సూచన.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement