స్టాక్ మార్కెట్లు గరిష్ట విలువలకు చేరి దిద్దుబాటుకు గురవుతున్న క్రమంలో, తమ పెట్టుబడులకు భద్రత కోరుకునే వారు టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఇది విలువ ఆధారిత పెట్టుబడుల విధానాన్ని అనుసరించే పథకం. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో 70 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది.
సెన్సెక్స్ పీఈతో పోలిస్తే తక్కువ పీఈతో ఉన్న స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. వివిధ మార్కెట్ క్యాప్‌తో కూడిన స్టాక్స్‌ను ఎంచుకుంటుంది. అంటే ఫ్లెక్సీ క్యాప్ ప్రొఫైల్‌గానే చెప్పుకోవాలి. ఉదాహరణకు ఏదైనా సమయంలో స్మాల్, మిడ్‌క్యాప్ విభాగాల్లోని స్టాక్స్ విలువల పరంగా మంచి ఆకర్షణీయంగా కనిపిస్తే ఆయా స్టాక్స్‌కు 35–40 శాతం నిధులను కేటాయిస్తుంది. 2013 చివర్లో, 2014లో ఇదే విధానాన్ని అమలు చేసింది.
విలువైన ఎంపిక
మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక ధరలకు చేరడంతో గత ఏడాది కాలంగా ఈ స్టాక్స్‌లో ఈ పథకం తన పెట్టుబడులను తగ్గించుకుంది. 2017 మే నెల నాటికి ఈ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్ 25 శాతంగా ఉంటే, ప్రస్తుతం 10 శాతమే ఉండటం గమనించాలి. అధిక వృద్ధి, అధిక విలువలున్న స్టాక్స్ జోలికి పోకుండా, తక్కువ విలువల వద్ద ఉండి, రానున్న కాలంలో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న స్టాక్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తుంది.
2017లో మార్కెట్లు మంచి ర్యాలీ చేస్తున్న సమయంలోనే మిడ్‌క్యాప్, ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించింది. అందుకే ఏడాది కాల రాబడులను గమనిస్తే ప్రామాణిక సూచీ అయిన సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువగా ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో ఈ పథకం 8.9 శాతం రిటర్నులు ఇస్తే, సెన్సెక్స్ రాబడులు 15.5 శాతంగా ఉన్నాయి. అయితే, మూడేళ్లు, ఐదేళ్ల కాలానికి చూస్తే సెన్సెక్స్ కంటే టాటా ఈక్విటీ ఫండ్ అధిక రాబడులను అందించింది. మూడేళ్లలో వార్షికంగా సగటున 15.5 శాతం, ఐదేళ్లలో అయితే వార్షికంగా 26.6 శాతం రాబడులు ఉన్నాయి. ఈ కాలంలో సెన్సెక్స్‌రాబడులు 10 శాతం, 14.9 శాతంగానే ఉన్నాయి.
పోర్ట్‌ఫోలియో
కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీగా ప్రాథాన్యాన్ని కూడా మార్చడం ఈ పథకం పనితీరులో భాగమే. ఎన్‌పీఏల సమస్యతో బ్యాంకు స్టాక్స్ కుదేలవుతున్న తరుణంలో బ్యాంకులకు బదులు ఫైనాన్స్ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. మార్కెట్లో అనిశ్చితి పెరగడంతో డెట్/ నగదు నిల్వలు పెంచింది. తాజా పోర్ట్‌ఫోలియోను గమనించినట్టయితే.... ఆటుపోట్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడుల రక్షణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈక్విటీల్లో 88 శాతం పెట్టుబడులను కలిగి ఉండగా, ఎక్కువ శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్ కావడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ, యస్ బ్యాంకు, రిలయన్స్‌లో వాటాలను పెంచుకుంది. ఈ ఏడాది ఆటో రంగంలో పెట్టుబడులను పెంచింది. మారుతి సుజుకి తరహా అధిక విలువకు చేరిన స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించుకుంది. అదే సమయంలో విలువల పరంగా ఆకర్షణీయంగా ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రాలో పెట్టుబడులను పెంచుకుంది. రూపాయి పతనం నేపథ్యంలో లాభపడే ఐటీ రంగ స్టాక్స్‌లోనూ పెట్టుబడులు గతంలో 1–2 శాతం మధ్య ఉంటే, 5 శాతానికి పెంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment