ఎప్పుడూ పన్ను గొడవేనా?
- అదే ఆలోచనతో ఓవర్ ఇన్వెస్ట్‌మెంట్లు వద్దు
- మినహాయింపు వర్తించేంతవరకే పెట్టుబడి
- దాన్ని మించి ఇన్వెస్ట్ చేసినా లాభం ఉండదు
రమేష్‌కు ఎప్పుడూ పన్ను మినహాయింపుల గొడవే. ఏది కొన్నా... ఎందులో ఇన్వెస్ట్ చేసినా... దీనివల్ల పన్ను ఆదా అవుతుందా? ఇలాగైతే ఐటీ నుంచి మినహాయింపు ఉంటుందా? అని ఆలోచిస్తుంటాడు. నిజానికి ఏడాదికి లక్ష రూపాయలవరకూ పన్ను కోత పడుతోంది కనక రమేష్ అలా ఆలోచించటంలో అర్థం లేకపోలేదు. కాకపోతే ఏ పనిచేసినా దీన్ని దృష్టిలో పెట్టుకునే చేయటం వల్ల... ఓవర్ ఇన్వెస్ట్‌మెంట్ అయ్యే అవకాశమూ ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ కథనం..
ఎవ్వరికైనా కట్టాల్సిన పన్ను గురించి మాత్రమే కాదు.. మినహాయింపులు పొందేందుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది కూడా తెలిసి ఉండాలి. లేకపోతే, ఆఖరు నిమిషం హడావుడిలో ఒకోసారి పన్ను ప్రయోజనాలకు మించి పెట్టుబడులు పెట్టి ఇరుక్కుపోయే ప్రమాదముంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద వివిధ సాధనాల్లో దాదాపు రూ.1.5 లక్షల దాకా చేసే ఇన్వెస్ట్‌మెంట్లకు మినహాయింపు లభిస్తుంది. ఈ పూర్తి మొత్తానికి సరిపడా పెట్టుబడులు పెట్టి, మినహాయింపు పొందగలిగితే మంచిదే. కానీ అలా జరగకుంటేనే చిక్కు. ఎంతో కొంత ప్రయోజనం వస్తుంది కదాని... అనువు కాని సాధనాలను ఎంపిక చేసుకుంటే.. ఏటా భారీ మొత్తాలు కట్టుకుంటూ పోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఆర్థిక ప్రణాళిక దెబ్బ తినొచ్చు. అలా జరగకుండా ముందునుంచే కొంత ప్లానింగ్ ఉంటే ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవచ్చు.
ఏటేటా కొనసాగించాల్సిన పెట్టుబడులు..
కొన్ని సార్లు పన్ను మినహాయింపులు పొందే ప్రయత్నంలో అనుకోకుండా.. తప్పనిసరిగా కొనసాగించాల్సిన పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేస్తుంటాం. దీనివల్ల మిగతావి ఎలా ఉన్నా సరే ముందు పెట్టిన పెట్టుబడి పోకుండా చూసుకునేందుకు ప్రతి సంవత్సరం మళ్లీ మళ్లీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంటుంది. దీంతో లక్ష్యానికి మించి పెట్టుబడులు పెట్టాల్సి రావడం వల్ల ఆర్థిక భారం పెరిగిపోతుంటుంది. అవసరమైన కవరేజీకి మించిన జీవిత బీమా ప్రీమియంలు మొదలైనవి దీనికి ఉదాహరణలు. కాబట్టి, అనవసర భారం పడకుండా.. అవసరమైనంత కవరేజీకి మాత్రమే ప్రీమియాలు, పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి.
ప్లానింగ్ కీలకం..
సరైన ప్లానింగ్ అంటూ లేకపోతే ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. సెక్షన్ 80సీ కింద దక్కే మినహాయింపులు పొందడం సాధ్యపడదు. వాస్తవానికి మనం గుర్తించని కొన్ని సాధనాలు వాటంతటవే పన్ను పరమైన ప్రయోజనాలు కల్పిస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈపీఎఫ్ (ఉద్యోగుల భవిష్య నిధి) కూడా ఒకటి. కానీ మనం లెక్కలు వేసుకునేటప్పుడు సాధారణంగా దీన్ని పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోతుంటాం. మినహాయింపు కోసం ఇంకా భారీ మొత్తాలు కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందేమోనని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి చిన్న వాటిని కూడా గుర్తుపెట్టుకుని ప్లానింగ్‌లో భాగం చేయగ లిగితే అనవసరమైన అధిక పెట్టుబడులు పెట్టే సమస్య ఉండదు.
సమీక్షించుకోవటం ముఖ్యం..
సంవత్సరం చివర్లో కాకుండా మధ్య మధ్యలో సెక్షన్ 80సీ ప్రయోజనాలకు అనువైన పెట్టుబడులను సమీక్షించుకుంటూ ఉండాలి. దీనివల్ల మనం ఇప్పటిదాకా చేసిన పెట్టుబడికి ఎంత మినహాయింపులు వస్తాయి, మనపై భారం పడకుండా భవిష్యత్‌లోనూ ప్రయోజనాలు చేకూర్చే సాధనాల్లో ఇంకా ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది లాంటివి తెలుస్తాయి. అప్పుడు ఆఖరు నిమిషంలో హడావుడి పడనక్కర్లేదు. కొంత మొత్తం పన్ను ప్రయోజనాలు పొందేందుకు భారీ మొత్తాలను అనవసరమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయకుండా.. మెరుగైన రాబడులు ఇచ్చే వాటిల్లో పెట్టుబడులు పెడితే ఉపయోగకరంగా ఉంటుంది. రిస్కులూ తగ్గుతాయి.