
న్యూఢిల్లీ: పలు అంశాల కారణంగా ఈ వారం మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల సంకేతాల్ని మన మార్కెట్ అందిపుచ్చుకోవొచ్చని వారన్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర గత శుక్రవారం హఠాత్తుగా పెరిగిన పరిణామంతో ఈ వారం ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జూన్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్న ప్రభావం కూడా సూచీలపై వుంటుందని వారు అంచనావేసారు. రుతుపవనాల గమనం మార్కెట్‌కు కీలకమైనదని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే అన్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కాస్త శాంతించినందున, ఈక్విటీలు పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు.
75 డాలర్ల సమీపంలోనే క్రూడ్...
ముడి చమురు(క్రూడ్) ఉత్పత్తి సరఫరాల్ని అంచనాలకు అనుగుణంగా ఒపెక్(క్రూడ్ ఉత్పత్తి దేశాల కూటమి) పెంచని కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర 75 డాలర్ల సమీపంలోనే కదలవచ్చని ఇండియాబుల్స్ వెంచర్స్ ఫండమెంటల్ అనలిస్ట్ ఫోరమ్ పారిఖ్ అంచనావేశారు. రోజుకు 1 మిలియన్ బ్యారళ్లకు మించి చమురు సరఫరాల్ని పెంచాలంటూ ఓపెన్ నిర్ణయించినట్లయితే ధరలు బాగా తగ్గివుండేవని ఆమె వ్యాఖ్యానిం చారు. బ్రెంట్ క్రూడ్ 80 డాలర్ల స్థాయిని మించితే, మన కరెంటు ఖాతాలోటు పెరిగిపోతుందని, దాంతో ఆర్‌బీఐ మళ్లీ రేట్లను పెంచే అవసరం ఏర్పడుతుందని, బ్రెంట్ క్రూడ్ ధర 70–75 డాలర్ల శ్రేణిలో ఉన్నంతవరకూ భారత్ ఈక్విటీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడబోదని, ఎంపికచేసిన షేర్లు పెరుగుతుంటాయని పారిఖ్ విశ్లేషించారు.
ట్రేడ్‌వార్ పరిణామాలు సర్దుబాటు..
అమెరికా–చైనాల మధ్య తలెత్తిన ట్రేడ్ వార్ పరిణామాల్ని మార్కెట్ సర్దుబాటు చేసుకున్నదని, ప్రస్తుతం వాణిజ్య యుద్ధం విస్తృతమైతే తప్ప..మార్కెట్‌కు అది పెద్ద రిస్క్ కాదని ఎపిక్ రీసెర్చ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముస్తాఫా నదీమ్ చెప్పారు. ముఖ్యంగా వాణిజ్య యుద్ధ ప్రభావం లేని రంగాల్లో ఆ రిస్క్ వుండబోదని ఆయన అంచనా వేశారు. మరో అభిప్రాయాన్ని ఈక్విటీ99 సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ రాహుల్ శర్మ వ్యక్తంచేస్తూ...ప్రస్తుత భౌగోళిక రాజకీయ అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధాన్ని ఇన్వెస్టర్లు సునిశితంగా గమనిస్తున్నారని, ఈ అంశంతో ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని అన్నారు. దేశీయంగా మార్కెట్‌కు చోదకంగా పనిచేసే అంశాలేవీ పెద్దగా లేనందున, అంతర్జాతీయ సంకేతాలే మన మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. జూన్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులు ఈ గురువారం ముగియనున్నందున, ట్రేడర్లు వారి ప్రస్తుత నెల పొజిషన్లను క్లోజ్‌చేసుకోవడం, వచ్చే నెలకు రోలోవర్ చేయడం వంటి కార్యకలాపాలతో మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment