
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో గ్రీవెన్స్ అధికారిని ఎందుకు నియమించలేదో వెల్లడించాలని కోరుతూ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సర్వోన్నత న్యాయస్ధానం సోమవారం నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై సవివర సమాధానం కోరుతూ ఐటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకూ సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నోటీసులపై స్పందించాలని కోర్టు ఆదేశించింది.
తన ప్లాట్‌ఫాంపై మెసేజ్‌లు ఎక్కడి నుంచి జనరేట్ అయ్యాయనే సమాచారాన్ని ట్రాక్ చేసే వ్యవస్థ నెలకొల్పాలని భారత్ చేసిన డిమాండ్‌ను వాట్సాప్ ఇటీవల తోసిపుచ్చింది. ఈ వ్యవస్థ ఏర్పాటుతో యూజర్ల గోప్యత కాపాడటం దెబ్బతింటుందనే కారణంతో భారత్ ప్రతిపాదనను తిరస్కరించింది. అన్ని రకాల సంభాషణలకు ప్రజలు వాట్సాప్ వేదికగా వాడుతున్నారని, అయితే తప్పుడు సమాచారంపై ప్రజలను అప్రమత్తం చేయడంపై తాము ప్రస్తుతం దృష్టిసారించామని వాట్సాప్ పేర్కొంది.
ఫేక్ న్యూస్, మూక హత్యల వంటి తీవ్ర నేరాలకు అడ్డుకట్ట వేయడంలో మెసేజ్‌ల మూలాలను పసిగట్టేందుకు సాంకేతిక పరిష్కారం ఏర్పాటు చేయాలని వాట్సాప్‌పై భారత్ ఒత్తిడి తెస్తోంది. భారత్‌లో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి, పటిష్ట సాంకేతిక వ్యవస్థను నెలకొల్పాలని, గ్రీవెన్స్ అధికారిని నియమించాలని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల వాట్సాప్ ఇండియా హెడ్ క్రిస్ డేనియల్స్‌తో భేటీ సందర్భంగా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment