సుజ్లాన్ జోరు
నెల రోజుల్లో 55 శాతం వృద్ధి
ముంబై: పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ షేర్ బుధ వారం 11 శాతం పెరిగింది. ఇదే రంగంలో కార్యకలాపాలు నిర్వహించే ఐనాక్స్‌విండ్ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రారంభమైన నేపథ్యంలో సుజ్లాన్ షేర్‌కు డిమాండ్ పెరిగింది. గత నెల 16న సన్ ఫార్మా దిలిప్ సంఘ్వి రూ.1,800 కోట్లతో ఈ కంపెనీలో 23 శాతం వాటాను కొనుగోలు చేసినప్పటి నుంచి ఈషేర్ జోరుగా పెరుగుతోంది. గత నెల 16ను రూ.19.14గా ఉన్న ఈ షేర్ ధర బుధవారం నాటికి 55 శాతం వృద్ధితో రూ.29.65 వద్ద ముగిసింది.
గత ఏడాది జూన్ నుంచి చూస్తే ఇది గరిష్ట స్థాయి. బుధవారం నాడు ఎన్‌ఎస్‌ఈలో 15.3 కోట్లు, బీఎస్‌ఈలో 3.4 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఐనాక్స్ ఐపీఓ ప్రారంభమైన నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీని రూ.30 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పేర్కొంది. పవన విద్యుత్తుకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తోన ఐనాక్స్ విండ్ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ రూ.315-325 రేంజ్‌లో ఉంది, దీంతో చూస్తే సుజ్లాన్ ఎనర్జీ షేర్ చౌకగా లభ్యమవుతోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పేర్కొంది.