న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలందించే స్విగ్గీ తాజాగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. గతేడాది కొనుగోలు చేసిన పాలు, నిత్యావసరాల డెలివరీ సంస్థ ’సూపర్’పై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ విభాగంపై దాదాపు రూ.680 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగ్గీ స్టోర్స్ పేరిట హైపర్ లోకల్ డెలివరీ వ్యాపారంలోకి, స్విగ్గీ డెయిలీ పేరిట సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఇంటి వంట డెలివరీ సేవల విభాగంలోకి స్విగ్గీ ప్రవేశించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఆరు నెలల్లో స్విగ్గీ నెలవారీ యూజర్ల సంఖ్య 10 రెట్లు పెరిగి 1,50,000 స్థాయికి చేరింది. తమ బ్రాండ్ పేరును, సొంత లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకునే ఉద్దేశంతో తాజాగా సూపర్ కార్యకలాపాలను కూడా విస్తరిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో 1 బిలియన్ డాలర్లు సమీకరించిన స్విగ్గీ మరో 500–600 మిలియన్ డాలర్లను సమీకరించే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
రోజుకు లక్ష డెలివరీలు..
సూపర్‌ను స్విగ్గీ గతేడాదే కొనుగోలు చేసినప్పటికీ.. అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. 2015లో శ్రేయస్ నగ్దావనె, పునీత్ కుమార్ దీన్ని ప్రారంభించారు. స్విగ్గీ చేతుల్లోకి వచ్చాక కూడా సూపర్ వారి సారథ్యంలోనే నడుస్తోంది. ప్రస్తుతం ఈ విభాగం బెంగళూరు, ముంబై, ఢిల్లీ– ఎన్‌సీఆర్ సహా ఆరు నగరాల్లో రోజుకు లక్ష పైచిలుకు డెలివరీలు అందిస్తోంది. మైక్రోడెలివరీ వ్యాపార విభాగంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్న మిల్క్‌బాస్కెట్, డెయిలీ నింజా తదితర సంస్థలకు స్విగ్గీ సారథ్యంలోని సూపర్ ఎంత మేర పోటీనిస్తుందన్నది చూడాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. సాధారణంగా ఇలాంటి స్టార్టప్స్‌కి ఎక్కువగా రోజూ సగటున రూ.70–90 ఆర్డర్లిచ్చే యూజర్లు ఉంటున్నారు. పాల డెలివరీ కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకున్నప్పటికీ ఇతర ఉత్పత్తులు కూడా కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది.
‘సూపర్’ మోడల్..
వారంవారీ, నెలవారీ చందాదారులకు పాలతో పా టు బ్రెడ్డు, గుడ్లు మొదలైన వాటికి కూడా సూపర్ డెలివరీ సర్వీసులు అందిస్తోంది. సంస్థ స్థూల అమ్మకాల్లో 70 శాతం వాటా పాలది కాగా.. మిగతాది ఇతర ఉత్పత్తులది ఉంటోంది. సుమారు అరవై శాతం ఆర్డర్లు భారీ గేటెడ్ సొసైటీల నుంచి ఉంటున్నాయి. దీంతో తక్కువ వ్యయాలతో డెలివరీ సాధ్యపడుతోంది. సూపర్ పోటీ సంస్థల వ్యాపార విధానం కూడా ఇదే రకంగా ఉంది. ఈ విభాగంలో కార్యకలాపాలను టాప్ 10 నగరాలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్విగ్గీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల వారికి కూడా చేరువవుతున్నందున.. సూపర్‌ను కూడా ఆయా మార్కెట్లలో ప్రవేశపెట్టొచ్చని పేర్కొన్నాయి. మరోవైపు సూపర్ పోటీ సంస్థ డైలీ నింజా కూడా కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. గతేడాదే ఇది మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ నుంచి పెట్టుబడులు సమీకరించింది. రోజువరీ ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది జనవరిలో 30,000 ఉండగా.. ప్రస్తుతం 90,000కు పెరిగినట్లు సమాచారం. అటు మిల్క్‌బాస్కెట్ కూడా యూనిలీవర్ వెంచర్స్, కలారి క్యాపిటల్ నుంచి 26 మిలియన్ డాలర్లు సమీకరించింది.
పాలు, నిత్యావసరాలు @ స్విగ్గీ
Published Thu, Jul 11 2019 5:22 AM | Last Updated on Thu, Jul 11 2019 5:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment