ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌.. ఆహా!! | Indian online food ordering market set to grow at 16.2%, to touch $17.02 billion by 2023 | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌.. ఆహా!!

Published Wed, Mar 27 2019 12:00 AM | Last Updated on Wed, Mar 27 2019 12:00 AM

Indian online food ordering market set to grow at 16.2%, to touch $17.02 billion by 2023 - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ వంటకు భారతీయులు అంతకంతకూ అలవాటుపడుతున్నారు. నచ్చిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో, మొబైల్‌ యాప్స్‌ నుంచి సులభంగా ఆర్డర్‌ చేసి, తామున్న చోటుకు తెప్పించుకుని తినేస్తున్నారు. పెద్ద పట్టణాల్లోనే కాదు, చిన్న పట్టణాలకూ ఈ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇంటి వంటకే ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. పెరుగుతున్న మహిళల ఆర్జన, టెక్నాలజీ అందుబాటు... ఆహారం విషయంలో ఆధునికతవైపు అడుగులు వేయిస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో ఈ రెండూ టాప్‌–2 ఫుడ్‌ డెలివరీ కంపెనీలు. స్వల్ప కాలంలోనే భారీ మార్కెట్‌ను సృష్టించుకున్న ఈ స్టార్టప్‌లు ఇప్పుడు చిన్న పట్టణాలకూ జోరుగా విస్తరిస్తున్నాయి. ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం, అదే సమయంలో ఈ ఫుడ్‌ డెలివరీ కంపెనీలు ఆఫర్‌ చేస్తున్న డిస్కౌంట్లతో ఆహార సంస్కృతి కూడా మారిపోతోందంటున్నారు విశ్లేషకులు. 

చిన్న పట్టణాల్లోకి చొచ్చుకుపోతున్నాయ్‌...
గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న జొమాటో ఇప్పటికే 165కు పైగా పట్టణాలకు చేరుకుంది. 2018 జూలై నుంచే 150 పట్టణాలను చేరుకోవడం కార్యకలాపాల వేగాన్ని తెలియజేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్విగ్గీ 2018 అక్టోబర్‌ నాటికి 30 పట్టణాల్లో సేవలను ఆఫర్‌ చేయగా, తాజాగా ఈ సంఖ్య 100 దాటింది. ఇదే తరహా కంపెనీలు ఫుడ్‌ పాండా (ఓలాకు చెందిన) 100 పట్టణాలకు చేరుకోవడం గమనార్హం. ఉబర్‌ ఈట్స్‌ 40 పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరింత వినూత్న నమూనాలతో తాము రావాల్సి ఉందంటున్నారు జొమాటో సీఈవో మోహిత్‌ గుప్తా. భారత్‌ వంటి దేశంలో కనీసం 500 పట్టణాలకు అయినా చేరుకోవడం సులభమేనన్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలపై ఈ కంపెనీలు పెద్ద అంచనాలతోనే ఉన్నాయి. ఇక్కడ తమకు భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయని అవి భావిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ కేవలం మెట్రో సంస్కృతిగానే భావించే పరిస్థితి ఉంటే, అది కాస్తా పూర్తిగా మారిపోవడాన్ని ప్రస్తుతం గమనించొచ్చు. పంజాబ్‌లోని ముక్త్‌సర్‌ పట్టణ జనాభా లక్షన్నర. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ పుట్టి పెరిగింది ఇదే పట్టణం. ఇక్కడ జొమాటో ఎప్పటి నుంచో ఉండగా, ప్రతి రోజూ 3,500 ఆర్డర్లను సొంతం చేసుకుంటోంది. జనవరిలో ఇక్కడికి ప్రవేశించిన స్విగ్గీ రోజూ 1,000 ఆర్డర్లను దక్కించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తుని పట్టణంలో జొమాటో నిత్యం 50,000 ఆర్డర్లను సొంతం చేసుకుంటుండడం విస్తరిస్తున్న ఈ సంస్కృతికి నిదర్శనం. జైపూర్‌ పట్టణ జనాభా 37 లక్షలు. నిత్యం ఇక్కడ 50వేల ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు నమోదవుతున్నాయి. 

భారీ విస్తరణ బాటలో...
స్విగ్గీ, జొమాటో తమ కార్యకలాపాల విస్తరణ కోసం గతేడాది నుంచి 2 బిలియన్‌ డాలర్ల (రూ.14వేల కోట్లు) మేర నిధులను సమీకరించాయి. జొమాటోకు చైనాకు చెందిన ఆంట్‌ ఫైనాన్షియల్‌ అండగా నిలవగా, స్విగ్గీ వెనుక దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్‌ ఉంది. ప్రతీ ఒకటి రెండు రోజులకు కొత్తగా ఓ పట్టణంలో ఇవి అడుగుపెడుతున్నాయి. స్విగ్గీ మొత్తం ఆర్డర్లలో 20–25 శాతం టాప్‌ 10 పట్టణాలకు వెలుపలి నుంచే వస్తుండడం గమనార్హం. జొమాటో టాప్‌ 15 పట్టణాలు కాకుండా ఇతర పట్టణాలను వర్ధమాన పట్టణాలుగా భావిస్తుండగా, ఈ ఏడాది చివరికి ఈ పట్టణాల మార్కెట్‌ వాటా 50 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ఈ రెండు సంస్థలు కలిపి ప్రతి నెలా మూడున్నర కోట్ల ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాయి. టాప్‌ ఏడు పట్టణాలు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్, కోల్‌కతా నుంచే మొత్తం మీద 85–90 శాతం విలువ మేర ఆర్డర్లు గతంలో వస్తుండగా, వీటి వాటా 65–70 శాతానికి తగ్గిపోయినట్టు రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ అధ్యయనంలో వెల్లడైంది. తర్వాతి 15–20 వర్ధమాన పట్టణాలు జైపూర్, అహ్మదాబాద్, విశాఖపట్నం, కోయంబత్తూరులో ఆర్డర్ల సంఖ్య రోజువారీ 60వేలకు చేరుకుంది. 2018లో 10–11 కోట్ల మంది ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై లావాదేవీలు నిర్వహించగా, ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు ఇచ్చిన వారి సంఖ్య ఇందులో పావు వంతే ఉంది. కానీ, ఇప్పుడు నిత్యం 20 లక్షల లావాదేవీలు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై జరుగుతున్నాయి. 17 లక్షల ఈ కామర్స్‌ లావాదేవీలను ఇవి మించిపోయినట్టు రెడ్‌సీర్‌ విశ్లేషణ. 

2023 నాటికి రూ.1.20 లక్షల కోట్లకు
మన దేశంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ మార్కెట్‌ ఏటా 16 శాతం చొప్పున పెరిగి 2023 నాటికి 17 బిలియన్‌ డాలర్ల (1.20 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని ‘మార్కెట్‌ రీసెర్చ్‌ ఫ్యూచర్‌’ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మెట్రో నగరాల్లో పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతుండడం ఆన్‌లైన్‌ ఫుడ్‌ మార్కెట్‌ వృద్ధికి చోదకంగా నిలుస్తున్నట్టు ఈ సంస్థ తెలిపింది.

సర్వేయర్లు చెప్పిన అంశాలు
►ఆఫర్లు, డిస్కౌంట్లు నచ్చి తాము ఆన్‌లైన్‌లో ఆహారం కోసం ఆర్డర్‌ చేసినట్టు 95 శాతం మంది చెప్పారు.
►సమయం ఆదా, సౌకర్యం అని చెప్పిన వారు 84%.
►సౌకర్యం కారణంగానే ఆన్‌లైన్లో ఆర్డర్‌ చేసిన వారు 78 శాతం మంది అయితే, ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉండడం వల్లే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసినట్టు 73 శాతం మంది చెప్పారు. 
►ఎక్కువ మంది మధ్యాహ్న భోజనం (లంచ్‌) ఆర్డర్‌ చేసి తెప్పించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కార్డుల ద్వారా ఎక్కువ చెల్లింపులు జరుగుతున్నాయి. 
►మొత్తం ఆన్‌లైన్‌ ఆర్డర్ల సంఖ్యాపరంగా బెంగళూరు నగరం మొదటి స్థానంలో ఉంది. 20 శాతం వాటా ఈ నగరానిదే.
► 18 శాతం వాటాతో ముంబై, 17 శాతం వాటాతో పుణే, 15 శాతం వాటాతో ఢిల్లీ, 12 శాతం వాటాతో హైదరాబాద్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement