సాక్షి, న్యూఢిల్లీ: సెల్ ఫోన్ దొంగతనాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. మొబైల్‌లో కీలకమైన 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐఎంఈఐ) మార్చితే కఠిన శిక్షలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నేపధ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం(డాట్) కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. ఐఎంఈఐ టాంపరింగ్ చేసినా, మార్చినా 3 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించనుంది. ఉత్పత్తి దారుడు తప్ప మిగిలిన ఎవరైనా ఐఎంఈఐ నెంబర్‌ను మార్చడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
15 డిజిట్ల ఈ నెంబరును టాంపరింగ్ చేస్తే ఐఎంఈఐ 2017 నిబంధనల ప్రకారం చట్టరీత్యా శిక్షకు అర్హులని పేర్కొంది. తయారు చేసిన కంపెనీ తప్పించి వేరే ఎవరు మార్చినా, తొలగించినా మూడేళ్ల పాటు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. తద్వారా నకిలీ ఐఎంఈఐ సంఖ్యలకు సంబంధించిన సమస్యలను అరికట్టడానికి , కోల్పోయిన మొబైల్ ఫోన్ల ట్రాకింక్‌ను కూడా సులభతరం చేయనున్నామని టెలికాం శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.భారతీయ టెలిగ్రాఫ్ చట్టం 2017 చట్టంలోని 7, 25 సెక్షన్ల ప్రకారం ఈ నిబంధనలను రూపొందించింది
ఐఎంఈఐ నెంబర్ల మార్పిడిపై కఠినమైన చట్టాలను రూపొందించే యోచనలో ఇటీవల డాట్ సంప్రదింపులు ప్రారంభించింది. ఈ కేసుల విచారణ సందర్భంగా ఒకే ఐఎంఈఐ నెంబర్‌తో సుమారు 18వేల హ్యాండ్‌సెట్లను డాట్‌కు చెందిన టెలికాం ఎన్‌ఫోర్స్‌మెంట్ రిసోర్స్ అండ్ మానిటరింగ్ (TERM) సెల్ కనుగొంది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మొబైల్‌చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త పద్ధతిని టెలికాం శాఖ అమల్లోకి తెస్తోంది. చోరీకి గురైన ఫోన్లలో సిమ్ కార్డు మార్చినా, ఐఎంఈఐ నెంబర్‌ను మార్చినా అన్ని నెట్‌వర్క్‌లను బ్లాక్ చేయనుంది.
కాగా సాధారణ మొబైల్స్‌నుంచి హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ దాకా మొబైల్ వినియోగం ఎంత పెరిగిందో.. అదే స్థాయిలో స్మార్ట్‌ఫోన్‌ల చోరీలు కూడా నమోదవుతున్నాయి. కొట్టేసిన మొబైల్ తాలూకు ఐఎంఈఐ నెంబర్లనుమార్చి.. వాటిని ట్రాక్ చెయ్యడానికి వీల్లేకుండా IMEI నెంబర్లు మార్చేసి వాడే వారు ఎక్కువైన సంగతి తెలిసిందే.