సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లకు ఉండే 15 అంకెల ఐఎంఈఐ నెంబర్‌ను ట్యాంపర్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. నకిలీ ఐఎంఈఐ నెంబర్లను అరికట్టడంతో పాటు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఫోన్ తయారీదారు కాకుండా వేరొకరు ఉద్దేశపూర్వకంగా ఐఎంఈఐ నెంబర్‌ను తొలగించడం, మార్చడం చట్టవిరుద్ధమని టెలికాం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఎంఈఐ నెంబర్‌ను మార్చడం, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం ఈ నిబంధనల కింద నేరంగా పరిగణిస్తారు.
మొబైల్ హ్యాండ్‌సెట్‌కు యూనిక్ ఐడీగా ఐఎంఈఐ నెంబర్‌ను కోడ్ చేస్తారు. సిమ్‌ను మార్చడం ద్వారా హ్యాండ్‌సెట్‌లో మొబైల్ నెంబర్‌ను మార్చడం సాధ్యమవుతుంది. అయితే ఐఎంఈఐ నెంబర్‌ను ప్రత్యేక పరికరాలతో సాంకేతిక అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే మార్చగలరు. ఈ తరహా ట్యాంపరింగ్‌కు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కఠిన నిబంధనలతో ముందుకొచ్చింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఐఎంఈఐ నెంబర్‌ను తారుమారు చేస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.