ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్యూ3లో 8,118 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సాధించినట్లు టీసీఎస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.8,105 కోట్ల నికర లాభం వచ్చిందని, 0.2 శాతం వృద్ధి సాధించామని టీసీఎస్ సీఈఓ, ఎమ్‌డీ రాజేశ్ గోపీనాధన్ తెలిపారు. సీక్వెన్షియల్‌గా 0.9 శాతం వృద్ధి సాధించామని వివరించారు. ఆదాయం రూ.37,338 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.39,854 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
ఒక్కో షేర్‌కు రూ.5 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది మూడవ మధ్యంతర డివిడెండ్ అని వివరించారు. ఈ డివిడెండ్‌కు రికార్డ్ డేట్ ఈనెల 25 అని, ఈ నెల 31న డివిడెండ్ చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఒడిదుడుకుల వాతావరణంలోనూ మార్జిన్లు పెంచుకోగలిగామని, ఇది తమ వ్యాపార విధాన సత్తాను వెల్లడిస్తోందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) వి.రామకృష్ణన్ వ్యాఖ్యానించారు. సీజనల్‌గా బలహీనంగా ఉండే క్యూ3లో ఆర్డర్ల అమలుపై ప్రధానంగా దృష్టి నిలిపామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఎన్.గణపతి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. భవిష్యత్తు వృద్ధికి అవసరమైన పెట్టుబడులను కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
ఆర్థిక ఫలితాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు......
- ఎబిట్ సీక్వెన్షియల్‌గా 7% పెరిగి రూ.9,974 కోట్లకు చేరింది.
- సీక్వెన్షియల్‌గా చూస్తే, మార్జిన్లు 1 శాతం పెరిగి 25 శాతానికి చేరాయి. కరెన్సీ ప్రయోజనాలు, ఆర్డర్ల అమలు కలసివచ్చాయి.
- షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) క్యూ3లో 0.1 శాతం వృద్ధితో రూ.21.63కు పెరిగింది.
- కార్యకలాపాల నికర నగదు రూ.9,451 కోట్లుగా ఉంది. నికర లాభంలో ఇది 116 శాతానికి సమానం.
- వ్యాపార విభాగాల వారీగా చూస్తే... లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ విభాగం ఆదాయం 17శాతం పెరిగింది. కమ్యూనికేషన్స్, మీడియా విభాగం 10 శాతం, తయారీ రంగ విభాగం 9 శాతం చొప్పున వృద్ధి చెందాయి.
- మార్కెట్ల పరంగా చూస్తే, యూరప్ మార్కెట్లు 16 శాతం, ఉత్తర అమెరికా 4 శాతం, ఏషియా పసిఫిక్ 6 శాతం, భారత మార్కెట్ కూడా 6 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. .
- ఈ క్యూ3లో స్థూలంగా టీసీఎస్ 22,390 ఉద్యోగాలను కల్పించింది. ఇక గత ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,46,675గా ఉంది. ఉద్యోగుల వలస (ఆట్రీషన్ రేటు) 12.2 శాతంగా ఉంది.
- ఈ క్యూ3లో భారీ సంస్థల నుంచి ఆర్డర్లను సాధించింది. వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయెన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన ఐఏజీ టెక్, బేయర్, తదితర సంస్థల నుంచి భారీ ఆర్డర్లను చేజిక్కించుకుంది.
మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్‌ఈలో టీసీఎస్ షేర్ 1 శాతం నష్టంతో రూ.2,218 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో ఈ షేర్ 19 శాతం లాభపడింది.
ఆర్డర్లు జోరుగా ఉన్నాయి...
ఈ క్యూ3లో ఆర్డర్ల బుక్ జోరుగా ఉంది. గత కొన్ని క్వార్టర్ల కంటే కంపెనీకి లభించిన ఆర్డర్లు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ క్యూ3లో 600 కోట్ల డాలర్ల ఆర్డర్లను సాధించాం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి మొత్తం ఆర్డర్లు 22 శాతం వృద్ధితో 1,800 కోట్ల డాలర్లకు పెరిగాయి.
– రాజేశ్ గోపీనాధన్, సీఈఓ, ఎమ్‌డీ, టీసీఎస్
Comments
Please login to add a commentAdd a comment