
ముంబై: ఏప్రిల్ నెల దేశీ వాహన విక్రయాల్లో 86 శాతం వృద్ధితో జోరు మీదున్న ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ తాజాగా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘నెక్సాన్’లో ఆటోమేటిక్ వెర్షన్ ‘టాటా నెక్సాన్ హైపర్‌డ్రైవ్ ఎస్–ఎస్‌జీ’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ.9.41 లక్షలు, రూ.10.3 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలూ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.
కంపెనీ 2017 ఫిబ్రవరిలో నెక్సాన్ మోడల్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. టాటా నుంచి మార్కెట్‌లోకి వచ్చిన తొలి సబ్– 4 మీటర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ఇది. కంపెనీ నెక్సాన్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి దాకా 30,000 యూనిట్లకు పైగా విక్రయించింది. బ్రాండ్‌ను మాత్రమే కాకుండా వినియోగదారుల ప్రాధాన్యాలను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రొడక్టులను తీసుకురావాలని, సర్వీసులు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీఖ్ ఈ సందర్భంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment