మైక్రోసాఫ్ట్‌తో టాటా మోటార్స్ జట్టు
ముంబై: మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాలను తీర్చిదిద్దుకునే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం టాటా మోటార్స్ వాహనాల్లో అడ్వాన్స్‌డ్ నేవిగేషన్, టెలిమాటిక్స్ మొదలైన సర్వీసులు మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. ఇందుకు సంబంధించిన తొలి వాహనాన్ని మార్చ్ 7న జెనీవాలో జరిగే ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఆవిష్కరించనున్నట్లు టాటా మోటార్స్ ఎండీ గుంటర్ బుషెక్ తెలిపారు.
కార్ల కొనుగోలుదారులు మరింత ఎక్కువగా విలువ ఆధారిత సర్వీసులను ఆశిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తమకు కొత్త ఆదాయ అవకాశాలను కల్పించగలదని ఆయన వివరించారు. ముందుగా ఇటీవలే ప్రవేశపెట్టిన సబ్–బ్రాండ్ టామో వాహనాలతో ప్రారంభించి, మిగతా బ్రాండెడ్ ప్యాసింజర్ వాహనాల్లో ఈ టెక్నాలజీలను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైన వాటితో వాహనాల్లో సురక్షితమైన ప్రయాణ అనుభూతి కలిగించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు.
టాటా టెక్నాలజీస్‌లో వాటా కొనుగోలు కోసం వార్‌బర్గ్ పిన్‌కస్ చర్చలు!
ముంబై: టాటా మోటార్స్‌కు చెందిన ఇంజినీరింగ్ విభాగం, టాటా టెక్నాలజీస్‌లో వాటా కొనుగోలు కోసం వార్‌బర్గ్ పిన్‌కస్ చర్చలు జరుపుతోందని సమాచారం. టాటా టెక్నాలజీస్‌లో మైనారిటీ వాటాను 45 కోట్ల డాలర్లకు ఈ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొన్ని వారాల్లోనే దీనికి సంబంధించిన డీల్ కుదరవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఈ డీల్ కుదరవచ్చు లేక కుదరకపోవచ్చని, మరో సంస్థ వాటా కొనుగోలు కోసం ముందుకు రావచ్చని ఆ వర్గాలు వివరించాయి. వాహన, వైమానిక, పారిశ్రామిక, యంత్ర సంబంధిత పరిశ్రమలకు డిజైన్, రీసెర్చ్, డెవలప్‌మెంట్ సర్వీసులను టాటా టెక్నాలజీస్ అందిస్తోంది. ఈ కంపెనీలో టాటా మోటార్స్‌కు 70.4 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి టాటా మోటార్స్‌కు భారీగా ఉన్న స్థూల రుణ భారం రూ.74,800 కోట్లలో కొంతైనా తగ్గగలదు. కాగా డీల్ వార్తలపై ఇరు వర్గాల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.