ఐదేళ్లలో 12 కొత్త కార్లు.. | Tata Motors plans to roll out 10-12 new passenger vehicles | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో 12 కొత్త కార్లు..

Published Wed, Aug 8 2018 12:49 AM | Last Updated on Wed, Aug 8 2018 12:49 AM

Tata Motors plans to roll out 10-12 new passenger vehicles - Sakshi

సనంద్‌: టాటా మోటార్స్‌ దేశీయ ప్యాసింజర్‌ వాహన విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లలో 10–12 ప్రయాణికుల వాహనాల (కార్లు)ను తీసుకురావాలని భావిస్తోంది. కొత్త ఉత్పత్తులను ఆల్ఫా, ఒమెగా అనే రెండు ప్లాట్‌ఫామ్‌లపై అభివృద్ధి చేయనున్నట్టు టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ తెలిపారు. ఈ ఉత్పత్తులతో ప్రయాణికుల వాహనాల విభాగంలో కంపెనీ స్థానం పటిష్టమవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

‘‘రానున్న ఐదేళ్లలో దేశీయ ఆటోమోటివ్‌ మార్కెట్‌ ఎన్నో విభాగాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఉప విభాగాలు కూడా ఏర్పడతాయి. ప్రస్తుత విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూనే కొత్త వాటిల్లోకీ ప్రవేశించాలన్నది టాటా మోటార్స్‌ ప్రణాళిక’’ అని పరీక్‌ తెలిపారు. ఎన్ని కొత్త ఉత్పత్తులు తీసుకురానున్నారు? అన్న మీడియా ప్రశ్నకు.. రెండు నూతన మాడ్యులర్‌ ప్లాట్‌ఫామ్‌లలో 10 నుంచి 12 వాహనాలను తీసుకురానున్నట్టు తెలిపారు.

కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలన్న ప్రక్రియలో భాగంగా ప్రయాణికుల వాహన అభివృద్ధికి ప్లాట్‌ఫామ్‌లను రెండింటికి పరిమితం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎస్‌యూ వీ హారియర్‌తో కొత్త ఉత్పత్తుల విడుదలను కంపెనీ వేగవంతం చేయనుంది. ప్రస్తుతం ప్యాసింజర్‌ వాహన విభాగంలో కంపెనీకి 70% మార్కెట్‌ వాటా ఉంది. 4.3 మీటర్ల పొడవుతో ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌లో వాహనాలను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఎస్‌యూవీలు, పెద్ద వాహన ఉత్పత్తులను ఒమెగా ప్లాట్‌ఫామ్‌ నుంచి తీసుకురానున్నట్టు చెప్పారు.

సరఫరాదారుల కుదింపు
టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహనాల విడిభాగాల సరఫరాదారులను 400కు తగ్గించుకోనుంది. ప్రస్తుతం సరఫరాదారుల సంఖ్య 600గా ఉంది. కంపెనీ లాభార్జన వ్యూహంలో ఇది కూడా భాగమే. సనంద్‌ప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచాలన్నది కంపెనీ ప్రణాళిక. ఈ ప్లాంట్‌లో అక్టోబర్‌ నుంచి టియాగో, టిగోర్‌ వాహనాలను నెలకు 12,500 యూనిట్ల తయారీకి తీసుకెళ్లనుంది.

టర్న్‌ అరౌండ్‌ విధానంలో భాగంగా సరఫరాదారులను క్రమబద్ధీకరించే పనిని చేపట్టినట్టు, ప్రస్తుతం ఇది కొనసాగుతోందని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ జి ఖాత్రి తెలిపారు. సంఖ్యపై ఆయన స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఖర్చులను తగ్గించుకునేందుకేనన్నారు. సనంద్‌ ప్లాంట్‌లో నానో కోసం విడిభాగాలను సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను టిగోర్, టియాగో వాహనాలకు విడిభాగాలను అందించే విధంగా అభివృద్ధి చేసినట్టు ఖాత్రి వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement