రక్షణకు రక్షణ.. రాబడికి రాబడి | Tata Retirement Savings Fund - Conservative Plan | Sakshi
Sakshi News home page

రక్షణకు రక్షణ.. రాబడికి రాబడి

Published Mon, Mar 19 2018 1:13 AM | Last Updated on Mon, Mar 19 2018 1:13 AM

Tata Retirement Savings Fund - Conservative Plan - Sakshi

రిటైర్మెంట్‌ జీవితానికి కావాల్సిన నిధిని సమకూర్చుకునేందుకు హామీ కూడిన పథకాలు, మార్కెట్‌ లింక్డ్‌ ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలు ఎన్నో ఉన్నాయి. పీపీఎఫ్, యులిప్‌ ప్లాన్లు, ఎన్‌పీఎస్‌ పథకాలు సైతం అందుబాటులో ఉన్నవే. రిటైర్మెంట్‌ అవసరాల కోసం రిస్క్‌ తక్కువగా ఉండి, మంచి రాబడులను ఆశించే వారు పరిశీలించతగిన వాటిలో టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌– కన్జర్వేటివ్‌ ప్లాన్‌ ఒకటి. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నవారు, రిటైర్మెంట్‌ తర్వాతా కొంచెం అదనపు రాబడులను ఆశించే వారు కూడా ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. తక్కువ నుంచి మోస్తరు రిస్క్‌ ప్రొఫైల్‌ వారికి ఇది అనువైనది.

పథకం నిర్వహణలోని మొత్తం నిధుల్లో 70శాతాన్ని తీసుకెళ్లి డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీంతో పెట్టుబడుల్లో అధిక భాగానికి రక్షణ ఉన్నట్టే. ఇక మిగిలిన 30 శాతాన్ని ఈక్విటీలకు కేటాయిస్తుంది. ఇది మాత్రమే రిస్క్‌తో కూడినది. దీర్ఘకాలంలో ఇందులో రిస్క్‌ సగటున పరిమితమై రాబడులకు అవకాశం ఉంటుంది. ఇక రిటైర్మెంట్‌ కోసమని పూర్తిగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు రిటైర్మెంట్‌కు సమీపిస్తున్న వేళ రిస్క్‌ తగ్గించుకోవాలని భావిస్తే ఈ పథకంలో మారిపోవడాన్ని పరిశీలించొచ్చు. దీంతో రిస్క్‌ తగ్గుతుంది. అయితే, టాటా రిటైర్మెంట్‌సేవింగ్స్‌ ఫండ్‌లో 60 ఏళ్లు రాకుండా వైదొలగాలని భావిస్తే కార్పస్‌పై 3 శాతాన్ని ఎగ్జిట్‌ లోడ్‌ కింద భరించాలి. ఇదొక్కటి ప్రతికూలత. 60 దాటితే ఎగ్జిట్‌లోడ్‌ ఉండదు.  

మెరుగైన పనితీరు...
ఇది హైబ్రిడ్, డెట్‌ ఆధారిత అగ్రెస్సివ్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈక్విటీలకు 25–30 శాతం మించి కేటాయింపులు చేయదు. దీంతో అన్ని కాలాల్లోనూ మెరుగైన పనితీరు ప్రదర్శించింది. ఏడాదిలో 9 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్లలో చూసుకుంటే 8.5 శాతం, ఐదేళ్ల కాలంలో సగటున 11.4 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో అన్ని రకాల వడ్డీ రేట్లలోనూ చెప్పుకోతగ్గ రాబడులను అందించింది. వడ్డీ రేట్లు పెరుగుతున్న కాలంలోనూ నష్టాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. అధిక రేటింగ్‌ కలిగిన డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం, పెట్టుబడుల వ్యూహాలే ఇందుకు కారణం. ఇక వడ్డీ రేట్లు పెరిగిన 2013 మే నుంచి 2014 ఏప్రిల్‌ వరకు, 2017 జూలై నుంచి 2018 ఫిబ్రవరి వరకు చూసుకున్నా రాబడులు 6.8 శాతం, 2.6 శాతం చొప్పున ఉన్నాయి. 

పోర్ట్‌ఫోలియో... డెట్‌లోనే అధికం
ప్రస్తుతం ఈక్విటీలో పెట్టుబడులు 29 శాతంగా ఉంటే, డెట్‌లో 71 శాతం ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ఈక్విటీ ర్యాలీల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఇక డెట్‌ సాధనాల్లో యాక్చువల్, డ్యురేషన్‌ థీమ్‌లను అనుసరిస్తుంది. 2014 బాండ్‌ ర్యాలీలో సగటు బాండ్ల కాల వ్యవధి 12 ఏళ్లు ఉండేలా చూసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement