
రహస్యాల ఉల్లంఘనకు పాల్పడ్డారు!
మిస్త్రీకి టాటా సన్స్ లీగల్ నోటీస్
• ఎన్‌సీఎల్‌టీ ముందు సున్నితమైన కంపెనీ పత్రాలను ఉంచారని విమర్శ
• ఈ చర్యలకు పాల్పడవద్దని స్పష్టీకరణ
ముంబై: ‘‘మీరు అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న పనులు నేరపూరిత విశ్వాస ఘాతుక చర్యల పరిధిలోకి వస్తాయి’’ ఇది తాజాగా బహిష్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీపై టాటా సన్స్ విమర్శ. ఈ మేరకు మంగళవారం మిస్త్రీకి టాటా సన్స్ ఒక లీగల్ నోటీస్‌ను జారీ చేసింది. తనను చైర్మన్‌గా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో దాఖలు చేసిన పిటిషన్‌లో పలు కీలక సున్నిత కంపెనీ పత్రాలను బహిరంగ పరిచారని టాటా సన్స్ ఈ లీగల్ నోటీసుల్లో పేర్కొంది.
ఇందులో బోర్డ్ సమావేశాల మినిట్స్, ఫైనాన్షియల్ అంశాలు, గణాంకాలు ఉన్నాయని పేర్కొన్న టాటా సన్స్, ఇది రహస్యాల ఉల్లంఘనలకు పాల్పడ్డమేనని పేర్కొంది. ‘‘టాటా సన్స్ డైరెక్టర్ హోదాలో మీకు అందిన కీలక, రహస్య, సున్నిత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడాన్ని ఇకముందు మానుకోండి’’ అని టాటా సన్స్ డిమాండ్ చేసింది.
నేపథ్యం ఇదీ...
టాటా గ్రూపు చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన మిస్త్రీ, ఆ తర్వాత గ్రూపు నిర్వహణ లోపాలపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. అనూహ్యంగా టాటా గ్రూపు కంపెనీల బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన మిస్త్రీ మరుసటి రోజే అంటే ఈ నెల 20న కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తోపాటు, మిస్త్రీ కుటుంబానికే చెందిన స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసింది. టాటా సన్స్ బోర్డ్ నిర్ణయాలను తోసిపుచ్చాలని, యాజమాన్య లోపాలను సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్‌ను పిటిషన్ కోరింది. అయితే పిటిషన్‌లపై జనవరి 31, ఫిబ్రవరి 1తేదీల్లో విచారణ జరిపేందుకు ట్రిబ్యునల్ డివిజన్ బెంచ్ అంగీకరించింది.
అప్పటికప్పుడు మధ్యం తర ఉపశమనం కల్పించాలన్న పిటిషనర్ వినతిని పరిశీలించబోమని... అసలు మధ్యంతర చర్యలను అనుమతించబోమని మాత్రం స్పష్టం చేసింది. అయితే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ట్రిబ్యునల్, విచారణను వేగంగా పూర్తి చేసి ఓ నెలలో ఆదేశాలు జారీకి అంగీకరించడం మిస్త్రీకి కొంతలో కొంత ఊరట. ఆయా పరిణామాల నేపథ్యంలో తాజాగా మిస్త్రీకి ఈ లీగల్ నోటీసులు జారీ అయ్యాయి.
మిస్త్రీకి టాటా సన్స్ తరఫున లా ఫామ్ ష్రాదుల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీ జారీ చేసిన తాజా లీగల్ నోటీసులో మరికొన్ని ముఖ్యాంశాలు...
⇔ పిటిషన్‌లో భాగంగా సైరస్ మిస్త్రీకి సంబంధించి రెండు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా పలు కీలక పత్రాలను దాఖలు చేశాయి. వీటిలో టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన ఆర్థిక సమాచార అంశాలు, వ్యాపార వ్యూహాలు రహస్య గణాంకాలు ఉన్నాయి.
⇔ టాటా కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద మీ బాధ్యతలను, టాటా సన్స్ పట్ల మీ విశ్వాస విధులను, రహస్య, కీలక సమాచారాన్ని బహిరంగ పరచకూడదన్న నిబంధనలను అన్నింటినీ మీరు ఉల్లంఘించారు.
⇔ ఒక డైరెక్టర్‌గా ఇది మీ న్యాయపరమైన బాధ్యతలను ఉల్లంఘించడమే కాదు, మా క్లయింట్ల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మీరు చేసిన చర్యలు టాటా సన్స్‌కు, టాటా గ్రూప్ కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయి.
⇔ మీ చర్యలు అన్నీ నిర్వహణారాహిత్య చర్యల కిందకి వస్తాయి. టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీల శ్రేయస్సును మీరు ఎంతమాత్రం కోరుకోవడం లేదన్న విషయాన్ని మీ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. జేఎన్ టాటా సౌశీల్యతలు మీ ప్రవర్తనలో కనిపించడం లేదు.
⇔ మీ లీగల్ పొసీడింగ్స్‌లో ఇచ్చే సమాచారం, వినియోగించే పత్రాలు టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీల ప్రయోజనాలకు ఎంతమాత్రం విఘాతం కలిగించరాదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
⇔ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే... న్యాయపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.