600 మందిపై వేటువేసిన టాటా
600 మందిపై వేటువేసిన టాటా
Published Tue, May 2 2017 4:48 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM
రిలయన్స్ జియో ఎంట్రీ ఇటు కస్టమర్లకు ప్రయోజనాలు ఏమో కానీ, ఉద్యోగుల, కంపెనీల పొట్టను కొడుతోంది. టెలికాం ఇండస్ట్రీలో భారీ నష్టాలతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి కంపెనీలు. తాజాగా టాటా టెలిసర్వీసెస్ కంపెనీ 500 నుంచి 600 మంది ఉద్యోగులను తీసేసినట్టు తెలిసింది. టెలికాం మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకోలేక, ఉద్యోగులపై వేటు వేసినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. సేల్స్, ఇతర సంబంధిత విభాగాల్లో పనిచేసే 500-600 మందిపై లేఆఫ్ ప్రభావం పడనుందని ఇద్దరు కంపెనీకి చెందిన వ్యక్తులు చెప్పారు. ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకెజ్ కూడా కంపెనీ ఆఫర్ చేసిందని తెలిపారు. ఒక్కో ఏడాది సర్వీసుకు నెల వేతనాన్ని ఇవ్వాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే దీనిపై టాటా టెలిసర్వీసెస్ ఇంకా స్పందించలేదు.
టెలికాం ఇండస్ట్రీకి ఇది చాలా ఛాలెంజింగ్ సమయమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్ జియో ఎంట్రీతో నెలకొన్న తీవ్రమైన టారిఫ్ వార్ తోనే టెలికాం ఇండస్ట్రీ ఈ ఉద్యోగాల కోతను భరించాల్సి వస్తుందన్నారు. జియో సంచలన ఆఫర్లు ఉద్యోగుల పొట్టను కొడతాయని ఇప్పటికే చాలా రోజుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చిన జియో ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. ఇండస్ట్రీ రుణం దాదాపు 4.6 లక్షల కోట్లకు ఎగిసింది. టాటా గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ, దేశవ్యాప్తంగా 19 టెలికాం సర్కిళ్లలో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. జీఎస్ఎం, సీడీఎమ్ఏ, 3జీ ప్లాట్ ఫామ్స్ పై టాటా టెలిసర్వీసెస్ వైర్ లెస్, వైర్ లైన్ నెట్ వర్క్స్ ను తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ అంచనాల ప్రకారం 2017 ఫిబ్రవరి 28కి కంపెనీ మొబైల్ సబ్ స్క్రైబర్ బేస్ 51.2 మిలియన్ పెరిగింది. దీంతో మొత్తంగా కంపెనీ మొబైల్ సబ్ స్క్రైబర్ బేస్ 1.16 బిలియన్ కంటే ఎక్కువగానే ఉంది.
Advertisement