ప్రపంచ టాప్ బ్రాండ్‌లలో ‘టాటా’ ల్యాండ్‌రోవర్
భారత్ కంపెనీకి చెందిన ఏకైక బ్రాండ్
లండన్: ప్రపంచంలో అత్యంత విలువైన 100 బ్రాండ్‌లలో టాటా గ్రూప్‌నకు చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ కార్ల బ్రాండ్ ల్యాండ్ రోవర్ చోటు దక్కించుకుంది. టాప్-100లో భారత్ కంపెనీకి చెందిన ఏకైక బ్రాండ్ ఇదే కావడం గమనార్హం. ఇంటర్‌బ్రాండ్ అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొం దించిన 2014 వార్షిక జాబితాలో ల్యాండ్ రోవర్ 4.47 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 91వ స్థానంలో నిలిచింది. కాగా, ప్రపంచ టాప్ బ్రాండ్‌గా యాపిల్ తన స్థానాన్ని నిలుపుకుంది. దీని బ్రాండ్ విలువ 119 బిలియన్ డాలర్లుగా అంచనా. 107 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో గూగుల్ రెండో స్థానంలో ఉంది.
భారత్‌కు చెందిన సీఈఓల సారథ్యంలోని 6 కంపెనీలు/బ్రాండ్‌లు జాబితాలో ఉన్నాయి. సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 5వ ర్యాంకు(61 బిలియన్ డాలర్లు)లో ఉంది. ఇంద్రా నూయి సీఈఓగా ఉన్న పెప్సికో(24వ స్థానం-19 బిలి యన్ డాలర్లు), శాంతను నారాయణ్ సీఈఓ గా ఉన్న అడోబ్(77వ స్థానం-5.3 బిలియన్ డాల ర్లు), అజయ్ బంగా సారథ్యంలోని మాస్టర్ కార్డ్(88వ స్థానం-4.7 బిలియన్ డాలర్లు) దీనిలో ఉన్నాయి. ఇవాన్ మెనెజెస్ సీఈఓగా ఉన్న డియాజియో బ్రాండ్‌లు స్మిర్నాఫ్(34 ర్యాంకు-13 బిలియన్ డాలర్లు), జానీ వాకర్(86 ర్యాంకు-4.8 బిలియన్ డాలర్లు) కూడా జాబితాలో ఉన్నాయి.