నాగాయలంకలో భారీ ఆయిల్ రిజర్వాయర్
కేశనపల్లిని మించిన నిక్షేపాలు
- ఫలించిన మూడేళ్ల ఓఎన్‌జీసీ శ్రమ
- రూ. 1,500 కోట్లతో డ్రిల్లింగ్‌కు సన్నాహాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ఓఎన్‌జీసీ మూడేళ్ల శ్రమ సత్ఫలితాన్నిచ్చింది. ఇంతవరకు ఈ బేసిన్‌లోని తూర్పుగోదావరి జిల్లా కేశనపల్లి క్షేత్రంలోని చమురు నిల్వలను మించిన నిల్వలను ఆ సంస్థ గుర్తించింది. కృష్ణా జిల్లా నాగాయలంక సమీపాన గుర్తించిన ఆ భారీ చమురు క్షేత్రంలో నిల్వలను వెలికి తీసేందుకు వచ్చే ఏడాది రూ.1,500 కోట్లతో కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
గత మూడేళ్లుగా ఓఎన్‌జీసీ ఆయిల్ నిక్షేపాల కోసం ఈ బేసిన్‌లో వెయ్యి కోట్లకు పైనే పెట్టుబడులు పెట్టి అన్వేషణ సాగిస్తున్నా నిరుత్సాహమైన ఫలితాలను చవిచూస్తోంది. నాగాయలంక పరిసర ప్రాంతాల్లో గత మూడేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం సంస్థ ప్రస్థానంలో పెద్ద మైలురాయిగా నిలుస్తుందంటున్నారు.
ఇప్పటివరకూ కేజీ బేసిన్‌లో తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి స్ట్రక్చరే అతి పెద్ద చమురు క్షేత్రంగా ఉంది. ఇక్కడ సుమారు 40 చమురు బావుల నుంచి రోజుకు 2 లక్షల లీటర్ల ముడి చమురు, 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ లభిస్తున్నాయి. 1992 ప్రాంతంలో గుర్తించిన కేశనపల్లి స్ట్రక్చర్ కేజీ బేసిన్‌కు తలమానికంగా నిలిచింది. ఇప్పుడు కేశనపల్లిని మించి నాగాయలంక స్ట్రక్చర్‌లో రోజుకు ఐదారు లక్షల లీటర్ల ముడిచమురు ఉత్పత్తికి అవకాశం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇది రెట్టింపు అయినా ఆశ్చర్యపడాల్సింది లేదంటున్నారు. చమురుతో పాటు గ్యాస్ కూడా భారీగా లభిస్తుందని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత మూడేళ్లుగా ఓఎన్‌జీసీ కేజీ బేసిన్ పరిధిలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో జియో ఫిజికల్, జియో కెమికల్ సర్వేలు నిర్వహించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కేశనపల్లి స్ట్రక్చర్ పరిధిలో నాలుగు, తాటిపాక పరిధిలో ఒకటి, కేశవదాసుపాలెం పరిధిలో ఒకటి, నర్సాపురం పరిధిలో ఒకటి వంతున బావుల్లో మాత్రమే కొత్తగా చమురు నిక్షేపాలు ఉన్నాయనే నిర్ధారణకు వచ్చింది.
కేశనపల్లి స్ట్రక్చర్ పరిధిలో తూర్పుపాలెం, గొల్లపాలెం, కరవాక తదితర ప్రాంతాల్లో చమురు లభించిన నాలుగు బావుల్లో ప్రస్తుతం ప్రొడక్షన్ టెస్టింగ్ పనులు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా నాగాయలంకలో భారీ చమురు క్షేత్రాన్ని గుర్తించడంతో ఆ సంస్థ సుదీర్ఘంగా చేస్తున్న నిరీక్షణకు ఫలితం ఖాయమైంది. ఇప్పటికే నాగాయలంక ప్రాంతంలో మూడు బావుల్లో డ్రిల్లింగ్ పూర్తి కావచ్చిందని ఓఎన్‌జీసీ వర్గాల ద్వారా తెలియవచ్చింది.
వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో డ్రిల్లింగ్ చేపట్టేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. నాగాయలంక ఫీల్డ్‌లో సుమారు 30-40 బావుల్లో ఆయిల్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్కడ డ్రిల్లింగ్‌కు 5 నుంచి 6 రిగ్‌లను వినియోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. 2015లో డ్రిల్లింగ్ ప్రారంభించి2016 ఆఖరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.