కారుచౌకగా ఇన్సులిన్
⇒ రూ. 460 కోట్ల వ్యయంతోఇన్సుమన్ కాట్రిడ్జ్ తయారీ కేంద్రం
⇒ ముప్పిరెడ్డిపల్లిలో సీఎం కేసీఆర్ భూమిపూజ
⇒ అందుబాటులోకి తెస్తున్న శాంతా బయో
⇒ ఇది పూర్తయితే రూ.850 నుంచి 150కి తగ్గనున్న ఇన్సులిన్ ధర!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే మధుమేహ వ్యాధిగ్రస్తులందరికీ ఇది శుభవార్తే. శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించే ఈ ఇన్సులిన్...
ఇప్పటితో పోలిస్తే ఆరోవంతు ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ దిగ్గజం ‘సనోఫి’కి అనుబంధ కంపెనీ అయిన శాంతా బయెటెక్నిక్స్ రూ.460 కోట్లతో ‘ఇన్సుమన్’ కాట్రిడ్జ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.
ఇది ఇన్సుమన్ కాట్రిడ్జ్‌లు ఉత్పత్తి చేయటం మొదలుపెడితే రూ.850గా ఉన్న ఇన్సులిన్ 150కే లభించే అవకాశముంది. హైదరాబాద్ సమీపంలోని ముప్పిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఈ తయారీ కేంద్రానికి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాట్రిడ్జ్ తయారీ కేంద్రం పూర్తయితే ఇన్సులిన్ అతితక్కువ ధరకే లభిస్తుందన్నారు. తక్కువ ధరల్లో వ్యాక్సిన్లు, ఇన్సులిన్లు అందిస్తోందంటూ శాంతా బయోటెక్నిక్స్‌ను అభినందించారు.
శాంతా బయో వ్యవస్థాపకుడు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం దేశంలో 6 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వీరందరికీ అందుబాటు ధరలో ఇన్సులిన్‌ను అందించాలన్న లక్ష్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాక సనోఫికి చెందిన ఇన్సుమన్‌ను వాడటం ద్వారా ఇన్సులిన్ తీసుకునేటప్పుడు వచ్చే నొప్పి కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం రోజువారీ తీసుకునే ఇన్సులిన్ సగటు ధర రూ.11గా ఉంది.
మా ఉత్పత్తులు అందుబాటులోకొస్తే ఈ ధర భారీగా తగ్గుతుంది’’ అన్నారు. ఏడాదికి 60 మిలియన్ కాట్రిడ్జ్‌ల తయారీ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ 2019 నాటికి అందుబాటులోకి రానుందని తెలియజేశారు. శాంతా బయోను టేకోవర్ చేశాక ఇప్పటి వరకు రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని, రానున్నకాలంలో మరో రూ.2,000 కోట్లు వెచ్చించనున్నట్లు సనోఫి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్లాడ్ స్పైసర్ తెలిపారు. 2009లో శాంతా బయోలో అత్యధిక వాటాను ఫ్రాన్స్ కంపెనీ సనోఫి చేజిక్కించుకోవడం తెలిసిందే.
త్వరలో పారిశ్రామిక విధానం...
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచంలోనే అత్యుత్తమమైన పారిశ్రామిక విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. ‘‘ఈ విధానం అందుబాటులోకి వచ్చాక పెట్టుబడి పెట్టే సంస్థకు చెందిన 10 నుంచి 12 మంది ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానిస్తాం. వారికి విమానాశ్రయం వద్ద ప్రోటోకాల్ అధికారులు ఘనస్వాగతం పలికి నేరుగా సీఎం చాంబర్‌కు తీసుకొస్తారు. కొద్ది నిమిషాలు మాట్లాడాక ఇన్వెస్టర్లు వారి దేశాలకు వెళ్ళిపోవచ్చు.
ఈ కొద్ది నిమిషాల చర్చల్లో వారి పెట్టుబడుల్లోని నిజాయితీని పరిశీలిస్తాం. అన్నీ బాగుంటే 11 నుంచి 12 రోజుల్లో పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్‌కు రావాలంటూ ప్రభుత్వమే ఫోన్ చేస్తుంది. పెట్టుబడులకు సంబంధించి అన్ని దరఖాస్తులూ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా అనుమతులు రాని పక్షంలో అవి వచ్చినట్లే భావించి పనులు ప్రారంభించుకోవచ్చు. అవినీతికి తావు లేకుండా వేగంగా అనుమతులిచ్చేలా రూపొందించిన ఈ పారిశ్రామిక విధానాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అని కేసీఆర్ వివరించారు.