‘రోబో 2.0’పై టెల్కోల అభ్యంతరం | Telco objection on 'robot 2.0' | Sakshi
Sakshi News home page

‘రోబో 2.0’పై టెల్కోల అభ్యంతరం

Published Wed, Nov 28 2018 1:54 AM | Last Updated on Wed, Nov 28 2018 5:35 AM

Telco objection on 'robot 2.0' - Sakshi

న్యూఢిల్లీ: అనేక అవరోధాలను అధిగమించి రిలీజ్‌కు సిద్ధమవుతున్న రోబో సీక్వెల్‌ 2.0 సినిమాకు ఈసారి టెల్కోల రూపంలో సమస్యలు వచ్చిపడ్డాయి. మొబైల్‌ ఫోన్లు, టవర్లు ఆరోగ్యానికి చేటు చేస్తాయన్న అర్థం వచ్చేలా ఈ సినిమా ట్రైలర్లు ఉన్నాయంటూ టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా కంటెంట్‌ టెల్కోల ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సినిమాకు ఇచ్చిన సర్టిఫికేషన్‌ను ఉపసంహరించాలంటూ సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ)ని కోరాయి. మొబైల్‌ ఫోన్లు, టవర్ల ద్వారా వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు .. ఇటు పర్యావరణానికి అటు మానవాళితో పాటు పక్షులు తదితర జీవరాశులకు హానికరమన్న భావన కలిగించేలా ఈ సినిమా ట్రైలర్స్‌ ఉన్నాయని సీవోఏఐ ఆరోపించింది.

 ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేకుండా మొబైల్‌ టవర్లు, ఫోన్లపై అవాస్తవాలను ప్రచారం చేయడం ద్వారా ఇవి ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సీబీఎఫ్‌సీ తమ అభ్యర్ధనపై నిర్ణయం తీసుకునే దాకా టీజర్, ట్రైలరుతో పాటు తమిళ వెర్షన్‌కి ఇచ్చిన సర్టిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని కోరుతున్నట్లు సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ తెలిపారు. స్టార్‌  రజనీకాంత్‌ కథానాయకుడిగా రూపొందిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా ఈ నెల 29న విడుదల అవుతోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement