న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల వివాదంలో టెల్కోలకు కాస్త ఊరట లభించింది. దీనిపై సుప్రీం కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా బలవంతంగా బాకీల వసూలుకు చర్యలు తీసుకోరాదని టెలికం శాఖ(డాట్) నిర్ణయించింది. లైసెన్సింగ్ ఫైనాన్స్ పాలసీ వింగ్ ఈ మేరకు అన్ని విభాగాలకు ఆదేశాలు పంపించింది. గతేడాది అక్టోబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ..సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద టెల్కోలు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. దీనికి జనవరి 23 ఆఖరు తేదీ. దీనిపై టెల్కోలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
దీంతో.. సుప్రీం కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వచ్చేదాకా ఏజీఆర్ బాకీలను కట్టలేమంటూ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా డాట్‌కు తెలియజేశాయి. ఈ రెండు సంస్థలు సుమారు రూ. 88,624 కోట్లు బాకీలు కట్టాల్సి ఉంది. మరోవైపు, రిలయన్స్ జియో సుమారు రూ. 195 కోట్ల ఏజీఆర్ బకాయిలను కట్టేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు, స్పెక్ట్రం వాడుకున్నందుకు గాను దాదాపు రూ. 3 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలకు డాట్ ఇచ్చిన నోటీసులపై చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. సమాచార లోపం వల్లే ఇది జరిగిందని, ఆయా సంస్థలు కట్టాల్సిన బాకీలేమీ లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment