ఇల్లు నేలపై.. అద్దె ఆకాశంలో! | the house rents increased by 20 percent in the year | Sakshi
Sakshi News home page

ఇల్లు నేలపై.. అద్దె ఆకాశంలో!

Published Sat, Feb 22 2014 12:48 AM | Last Updated on Mon, Oct 8 2018 8:34 PM

ఇల్లు నేలపై.. అద్దె ఆకాశంలో! - Sakshi

ఇల్లు నేలపై.. అద్దె ఆకాశంలో!

 హైదరాబాద్‌లో నిలువ నీడ కష్టమైపోతోంది. వేల రూపాయలు గుమ్మరిస్తేగానీ పట్టుమని మూడు గదులు దొరకని దుస్థితి ఏర్పడింది. ఏడాదిలో నగరంలో ఇంటి అద్దెలు 20 శాతం పెరిగాయని నగరంలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. నింగినంటిన నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యులను విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను పెంపును సాకుగా చూపి ఇష్టారాజ్యంగా ఇంటి కిరాయిలు పెంచుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.  ఒకేసారి 20 శాతం వరకు అద్దెలు పెరగడం మున్నెన్నడూ చూడలేదని పలువురు ఆవేదన చెందడం సమస్య తీవ్రతకు దర్పణం పడుతోంది. - సాక్షి, హైదరాబాద్

 మన రాష్ట్రం నుంచే కాకుండా గుజరాత్, మహారాష్ట్ర, కేరళ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు హైదరాబాద్‌లో నివాసముండేందుకు ఇష్టపడతారు. అందరూ ఇక్కడ సొంతిల్లు కొనేంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో అద్దె ఇళ్లపై ఆధారపడతారు. దీంతో నగరంలో ఏటా అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. అద్దె ఇళ్లను వెతికేందుకు ప్రత్యేకించి వ్యాపారాలు వెలిశాయంటే వీటి గిరాకీని అర్థం చేసుకోవచ్చు.

 ఆకాశంలో అద్దెలు..
 నగరంలో ఆధునాతన  సౌకర్యాలతో నిర్మితమవుతున్న అపార్ట్‌మెంట్లలో అద్దెలు ఆకాశంలో విహరిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో సింగిల్ బెడ్ రూమ్ అద్దె రూ.4 వేలకు పైగానే ఉంది. డబుల్ బెడ్ రూమ్ అయితే రూ.6 వేలకు పైగా పలుకుతోంది. లిఫ్టు, మెయింటెనెన్స్ చార్జీలు అదనంగా మరో వెయ్యి వదిలించుకోవాల్సిందే. కంటోన్మెంట్, తార్నాక, ఎల్బీనగర్  వంటి శివారు ప్రాంతాలు, సాధారణ కాలనీల్లోనూ ఓ మోస్తరు అద్దెలు పలుకుతున్నాయి. రోజుకూలి చేసుకునే వారి ఆదాయంలో సగం ఇంటి అద్దెకే సరిపోతుండడంతో ఆర్ధాకలితో ఆలమటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యతరగతి ప్రజల పరిస్థితీ ఇంచుమించు ఇదే. దీనికి తోడు నగరంలో చదువుకునేందుకు వస్తున్న విద్యార్థులు కూడా అద్దె గదులు దొరకక ఇబ్బంది పడుతున్నారు. అన్నింటికీ కాస్త అందుబాటులో ఉండే ఇల్లు కావాలంటే నెలకు రూ.4 వేలకు పైగానే చెల్లించుకోవాలి. లేదంటే శివారు ప్రాంతాలే గతి.

 విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్నే కారణం..
 నగరంలో ఏడాదిలో 20 శాతం ఇంటి అద్దెలు పెరిగాయి. బంజారాహిల్స్, గచ్చిబౌలి వంటి పోష్ కాలనీల్లో 2010-11 మధ్య కాలంలో సింగిల్ రూమ్ రూ.3,500 ఉండేది. కానీ ప్రస్తుతం ఇదే ప్రాంతంలో ఇంటి అద్దె రూ.5 వేలు పలుకుతోంది. ఏడాదిలో పెరిగిన విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను పెంపు వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఇంటి యజమానులు చెబుతున్నారు. దీనికితోడు ఇంటి నిర్వహణ చార్జీలు అద్దెవాసులకు భారంగా మారుతున్నాయి. సాధారణంగా నిర్వహణ ఖర్చులను ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి వసూలు చేస్తుంటారు.

 ఒక్కో అపార్ట్‌మెంట్‌లో ఒక్కో తీరుగా ఉంటుంది. మలేసియా టౌన్‌షిప్‌లో అయితే చ.అ. రూ.1.75 పైసలతో పాటు నీటి బిల్లుకు మరో రూ. 500 అదనం. ఇది 2007లో రూ. 200 ఉండేది. కానీ పెరిగిన ధరల నేపథ్యంలో రుసుములను పెంచేశారు. సింగపూర్ టౌన్‌షిప్‌లో అయితే 1, 2, 3 పడక గదులకు వేర్వేరుగా నిర్వహణ రుసుములను వసూలు చేస్తున్నారు. త ్వరలోనే నిర్వహణ రుసుమును పెంచాలని సొసైటీ పాలకవర్గం నిర్ణయించినట్లు సమాచారం. ఇక సగటు జీవులుండే సాధారణ అపార్ట్‌మెంట్లను పరిశీలిస్తే.. నెలవారీ నిర్వహణ ఖర్చుల కింద రూ. 800 వసూలు చేసే చోట ఇప్పుడు రూ. 1,000కి పైగా చేరింది. ఇది రూ. 500 ఉన్న చోట అయితే రూ. 700లకు చేరింది.

 నియంత్రణేది..
 పాత భవనాల అద్దె నియంత్రణ చట్టం అమలు హైదరాబాద్‌లో భూతద్ధం పెట్టి వెతికినా కనిపించదు. ఈ చట్టం ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు తక్కువ అద్దెకు పాత భవనాలు (ప్రారంభించి 20 ఏళ్లు నిండిన) కేటాయిస్తుంటారు. పాత భవనాల వివరాలను జీహెచ్‌ఎంసీ సేకరించి జాబితా రూపొందిస్తుంది. దరఖాస్తు చేసుకున్న కుటుంబాలకు వీటిని కేటాయిస్తుంటారు. ఇష్టారాజ్యంగా అద్దె పెంచకుండా శాస్త్రీయ పద్ధతిలో అమలు చేయాలన్నది ఈ చట్టం ఉద్దేశం. అందుకు విరుద్ధంగా ఎవరైనా అద్దె నిర్ణయించినా, పెంచినా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement