అద్దెకు ఆఫీసు!
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ప్రాంతాల్లో ఆఫీసు తెరవాలంటే అక్కడి స్థిరాస్తి ధరలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, చిన్న కంపెనీలు భరించలేనంతగా ఉంటాయన్నది నిజం. ఈ ప్రాంతాల్లో వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కోట్లలో పెట్టుబడి, ఆఫీసు ఫర్నీచర్, ఉద్యోగులకు వేతనాలు ఇలా అన్నింటి భారాన్ని మోస్తూ బిజినెస్‌ను నడపడమంటే మామూలు విషయం కాదు. ఇలాంటి కష్టాలకే చెక్ చెబుతాయి వర్చువల్ ఆఫీసులు. ఆఫీసు స్థలం నుంచి ఫర్నీచర్, ఉద్యోగుల వరకు అన్నీ అద్దెకు లభించడమే వీటి ప్రత్యేకత. దీంతో వ్యాపారం చేద్దామనుకున్న 3 గంటల్లోనే ప్రారంభించొచ్చు. వీటి లాభాలు చూసి చిన్న కంపెనీలే కాదు మల్టినేషనల్ కంపెనీలూ ఆసక్తి చూపిస్తున్నాయి.
స్థలం నుంచి ఉద్యోగుల వరకు..
వర్చువల్ ఆఫీసు అంటే కార్యాలయానికి అవసరమైన స్థలం నుంచి ఫర్నీచర్, ఫోన్, ఫ్యాక్స్ నెంబర్లు, బిజినెస్ కార్డులు, లెటర్ హెడ్స్, సమావేశాల కోసం ప్రత్యేక గదులు, ఆడియో, వీడియో సౌకర్యం, ఇంటర్నెట్ సేవలు.. ఇలా ప్రతి ఒక్కటీ అద్దెకిస్తారు. అంతేకాకుండా అద్దెకు తీసుకున్న ఆఫీసులో ఒక రిసెప్షనిస్ట్ కూడా ఉంటుంది. ఈ రిసెప్షనిస్ట్ సంబంధిత కంపెనీకి వచ్చే ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకొని యజమానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఆఫీసుకొచ్చే లెటర్లను కంపెనీ యజమానికి కొరియర్ చేస్తారు.
కంపెనీలెన్నో..
దశాబ్ధకాలంగా బాగా ప్రాచుర్యం పొందిన సర్వీస్, వర్చువల్ ఆఫీసు సేవలను నగరంలో చాలా కంపెనీలందిస్తున్నాయి. ఇంపీరియల్ సర్వ్‌కార్ప్ హైదరాబాద్, ముంబై నగరాల్లో 50 వేల చ.అ. విస్తీర్ణంలో సర్వీస్, వర్చువల్ ఆఫీసు సేవలనందిస్తోంది. గచ్చిబౌలిలోని ఐటీ పార్క్, ముంబయిలో అయితే బంద్రకుర్లా కాంప్లెక్స్‌లో ఈ ఆఫీసులున్నాయి. ఐకేవా అనే మరో సంస్థ బంజారాహిల్స్‌లోని ఎంబీ టవర్స్‌లో, బెంగళూరులో అయితే కేస్నా బిజినెస్ పార్క్‌లోని ఉమియా బిజినెస్ బేలో ఈరకమైన సేవలనందిస్తోంది.
ప్రయోజనాలెన్నో..
కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టే వారు ఆ బిజినెస్‌ను ప్రజలు ఎలా స్వాగతిస్తారు? ఎలాంటి మార్పులవసరం వంటి అనేక అంశాలను తెలుసుకునేందుకు వర్చువల్ ఆఫీసులు ఉపయోగపడతాయి.
కంపెనీకి ప్రొఫెషనల్ బిజినెస్ అడ్రస్ వస్తుంది. అందరూ సులువుగా గుర్తు పట్టే ప్రాంతంలో ఆఫీసు అడ్రస్ ఉండటంతో కంపెనీపై నమ్మకం ఏర్పడుతుంది.
వర్చువల్ ఆఫీసైతే యజమాని రోజూ ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇంధన వినియోగం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు చేసినవారమవుతాం.
వర్చువల్ ఆఫీసు సేవలు రెండు రకాలు. 1. వర్చువల్ ఆఫీసు 2. సర్వీస్ ఆఫీసు.
వర్చువల్ ఆఫీసు: ఆఫీసుకు చిరునామా, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ సేవలుంటాయి. క్లయింట్లు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకునేందుకు ఓ రిసెప్షనిస్ట్ ఉంటుంది. ఆఫీసుకొచ్చే ఫోన్లు స్వీకరించి సంబంధింత యాజమాన్యానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇక ధర విషయానికొస్తే.. ఫోన్ నంబర్, అడ్రస్, ఫ్యాక్స్ సేవలకైతే నెలకు ఒక్కో దానికి రూ.2,500 చెల్లించాలి. అందరికి తెలిసిన బిజినెస్ అడ్రస్ ఉంటుంది కాబట్టి కస్టమర్లకూ నమ్మకముంటుంది.
సర్వీస్ ఆఫీసు: వీటిలో ఆఫీసును పెట్టుకునేందుకు వీలుగా అద్దెకు స్థలం కేటాయిస్తారు. చ.అ.లను బట్టి ధరలుంటాయి. సుమారుగా రూ.40 వేలు నుంచి లక్షకు పైగానే ధరలున్నాయి. అలాగే సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా ప్రత్యేక గది ఉంటుంది. దీనికి 10 నిమిషాలకు రూ.85 చెల్లించాలి.
మరో 7 నగరాలకు విస్తరిస్తున్నాం
ప్రస్తుతం హైదరాబాద్, ముంబై నగరాల్లో మాత్రమే ఇంపీరియల్ సర్వ్‌కార్ప్ సేవలున్నాయి. రెండేళ్లలో బెంగళూరు, గుర్గావ్, చెన్నై, పుణె, ముంబైలోని మరో మూడు ప్రాంతాల్లో ఈ సేవలన్ని విస్తరిస్తాం. ఒక్కో నగరంలో 15 వేలు- 25 వేలు చ.అ. విస్తీర్ణాన్ని అందుబాటులోకి తెస్తాం. - తన్విర్ ఎస్ కౌర్, ఇంపీరియల్ సర్వ్‌కార్ప్ కంట్రీ హెడ్