పెళ్లి కాని జంటల కోసం..
పెళ్లయిపోయిన వాళ్ల మాట ఏమోగానీ.. పెళ్లికాని ప్రేమికులు ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడపాలంటే చాలా కష్టం. వాళ్లకు గదులు దొరకవు. ఒకవేళ ఏదైనా హోటల్లో గది తీసుకుందామన్నా పోలీసులతో ఇబ్బందే. ఈ సమస్యను గుర్తించిన బిట్స్ పిలానీ మాజీ విద్యార్థి సంచిత్ సేథి ఓ పరిష్కారం కనుగొన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లతో అనుసంధానం అయ్యేలా 'స్టే అంకుల్' అనే కొత్త స్టార్టప్ కంపెనీ ప్రారంభించాడు. ఈ హోటళ్లలో పెళ్లికాని జంటలు కూడా ఎంచక్కా గడపొచ్చు. వెబ్‌సైట్‌లో ఉన్న జాబితాలో ఉండే హోటళ్లలో 10-12 గంటల పాటు గడపొచ్చు. కావాలనుకుంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు లేదా, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు ఉండొచ్చు. ఇందుకు అద్దె రూ. 2వేల నుంచి రూ. 6వేల వరకు ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ప్రారంభించిన కొత్తలో పర్యాటకులు ఎక్కువగా వస్తారని అనుకున్నారు. కానీ పెళ్లికాని జంటల నుంచి పదేపదే తమకు హోటల్ గదులు కావాలని రిక్వెస్టులు రావడంతో అటుదిశగా చర్యలు ప్రారంభించారు.
నిజానికి భారతదేశంలో చట్టాల ప్రకారం పెళ్లికాని జంటలు గది అద్దెకు తీసుకోకూడదని ఎక్కడా లేదని, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా గది అద్దెకు తీసుకోవచ్చని సంచిత్ సేథి చెప్పారు. కొన్ని హోటళ్ల వారు ఇందుకోసం ముందుకొచ్చినా, బహిరంగంగా చెప్పలేకపోతున్నారని, ఈ ఆలోచనా ధోరణిని మార్చాలన్నదే తన ప్రయత్నమని అన్నారు. తమ జాబితాలో ఉన్నవాటిలో చాలావరకు ప్రముఖ ప్రైవేటు హోటళ్లేనని చెప్పారు.