ఎంపీసీకి ముగ్గురు ఆర్థికవేత్తలు
నియమించిన కేంద్రం...
* ద్రవ్య పరపతి విధాన రేటు నిర్ణయ ప్రక్రియలో తాజా నిర్ణయం
* పదవీకాలం నాలుగేళ్లు..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయానికి ఏర్పాటవుతున్న పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)కి ప్రభుత్వం తరఫున ముగ్గురు ప్రముఖ ఆర్థిక విద్యావేత్తలను కేంద్రం గురువారం నియమించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రభుత్వం తరఫున ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాల పేర్లను నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(ఏసీసీ) ఖరారు చేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. వీరి పదవీ కాలం నాలుగేళ్లు. పునర్‌నియామకానికి అవకాశం లేదు. కాగా ప్రస్తుతం ఆర్‌బీఐ ఐదుగురు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుల్లో చేతన్ ఘాటే ఒకరు.
రెపోకు ఇక మెజారిటీ నిర్ణయం
ఈ ముగ్గురితో పాటు కమిటీలో ఆర్‌బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరు ఓట్ల మెజారిటీ ప్రాతిపదికన పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు నిర్ణయం ఉంటుంది. ఒకవేళ రేటు నిర్ణయంలో కమిటీ చెరిసమానంగా చీలిపోతే... ఆర్‌బీఐ గవర్నర్ గా ఆయన అదనపు ఓటు కీలకం అవుతుంది. ఇక కమిటీలో ఆర్‌బీఐ గవర్నర్, ఒక డిప్యూటీ గవర్నర్, మరో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 4న జరిగే 2016-17 ఆర్‌బీఐ నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు నిర్ణయం ఏకాభిప్రాయ నిర్ణయం ప్రాతిపదికనే జరుగుతుందని భావిస్తున్నారు.